అమ్మకు జే జే కథ

అమ్మకు జేజే!

మా ఆందేలి తాతోళ్లది మా వూరు గాదంట. మా వూరికి పరంటగా ఆరు మైళ్లుండే ‘ఆముదాల’ అనే వూరంట. మా పొట్టతాతకి పెదనాయిన కూతురు, అప్పజెల్లయిన లక్షుమమ్మని, ఆందేలి తాతకి ఇచ్చి పెండ్లి జేసినారంట. ఆందేలి తాత అసలు పేరు జెప్పనే లేదు కదా.. వెంకటాచలం బోయుడు. వోళ్లకి పెండ్లయ్యి కొంతకాలందాకా పిలకాయిలు పుట్టకుండా వుంటే శోలింగర్ (చోళలింగాపురం) నరసింహ సామికి మొక్కుంటే.. మొదటగా కూతురు పుట్టింది. కూతురికి ‘నరసమ్మ’ అని పేరు పెట్టుకొనిరి. తర్వాత కొడుకు నరసింహులు. తర్వాత ముగ్గురు కూతుళ్లు పుట్నారంట. పెద్దకూతురు ‘నరసమ్మే’ మా అమ్మ. ఆముదాల్లో బతుకే గతిలేక మా వూరుకొచ్చేసినారంట.
అయిదేండ్ల వొయిసులోనే కూలి పనులకు పోయేదంట మాయమ్మ. సేద్దెం చేసే దానికి నేల లేదు. బండకొట్టను గూడా రాదు మా ఆందేలి తాతకు. నల్లరాళ్ల కట్టడం కట్టేది, బండికట్టి చేన్లకు మట్టి తోలేది. ఇట్టో పనులు మాత్రం చేసేవోడు. మా యమ్మ కూలి పన్లకు పోయి అంతో ఇంతో సంపాదించుకొస్తే కొంతలో కొంత ఇల్లు గడస్తా వుండేది. కూలిపన్లు లేని నాళ్లల్లో మా పొట్ట తాతోళ్లింట్లో పనులు జేసేదంట. తెల్లార్లేసి చేదబాయిలో నీళ్లు చేది తొట్లు నింపేసి, కల్లాపి జల్లి ముక్కర్రయేసి, పేడెత్తి చెత్తదోసి, కుంటి చేతులాయె (మా నాయనమ్మ) పోసిన అంత సద్ది తాగేసి, చేన్ల కాడికో, మొటిగోడు మూలకో పోయేదంట. సందేళకాడ గొడ్లు తోలుకోనొస్తే అంత మిగిలింది సగిలింది యేసి పంపేదంట మా కుంటిసేతులవ్వ. ఎన్ని పనులు జేసినా మాయమ్మను ఇంట్లోకి మాత్రం రానిచ్చేది కాదంట మాయవ్వ! తినేదానికి ఒక సత్తుగినె్న, తాగేదానికి ఒక సత్తు లోటాయి ఇంటి బయిటనే పెట్టుకోవాల.
మా అత్తోళ్లకి పెళ్లిల్లయి పొయినాంక చివరత్త రేణుకమ్మకి పెండ్లి వొయిసురాలా… అప్పట్నుంచి గొడ్లకాడ పెత్తనం ఆమెకొచ్చింది. దాన్తో మాయమ్మ మళ్లీ మట్టి తట్టలు మోయడం, కోతలు కోయడం, కలుపు తీయడం, తొవ్వటం తొవ్వడం లాంటి కూలి పన్లకు పోతావుండేది.
అడపాదడపా మా పొట్ట తాతోళ్ల ఇంట్లో కూడా పనులు జేస్తానే వుంది. ఎన్ని పనులు జేసినా కడుపుకంత తిండి దొరికేది కాదు. నోరుగట్టి, కడుపుగట్టి బతుకు లాగతావుంటే.. కూతురు కస్టాలు చూసి మా ఆందేలి తాత ఏడ్చేసేవాడంట.
ఇట్టుంటే మా నాయినకి అక్కడా ఇక్కడా పిల్లను జూస్తా వుండారంట. ఈ విసయంలో మాయవ్వకి పెదిస్టగా వుండేది. కీసలం నుంచి బోడెమ్మి కూతుర్ని తెచ్చి చెయ్యాలని ఒకే పట్టు పట్టుకొనింది. ఏనాడూ మొగుడైన పొట్టతాతతో నేరుగా మాటాడింది లేలదు మా యవ్వ. ఇంట్లో వోళ్లిద్దురే వుండినా ‘అన్నం తినను రమ్మనబ్బ’ అంటా గోడకు చెప్పేది, దాని కాయన ముసిముసిగా నవ్వుకొని.. ముందర అరిటాకేసుకొని ‘అన్నం పెట్టమనబ్బ’ అని ఆయన గూడా గోడకే చెప్పేవాడు. అట్నే ఒగనాడు ‘నారాయుడికి కీసలంలో బిడ్ని చూసిండాను. ఆ బోడెమ్మ కూతుర్ని కట్టబొయ్యేదని చెప్పబ్బ’ అని మాయవ్వ గోడకు చెబితే, దానికి మా తాత ‘బోడెమ్మ లేదు, గీడెమ్మ లేదు.. నేను చూసిన బిడ్నే వోడికి కట్టబొయ్యేదని చెప్పబ్బ’ అని గోడకు బదులు చెప్పినాడంట. నోరూ వారుూలేనోడు. అంతగా లోకజ్ఞానం తెలీని మా నాయినకు.. అన్నీ తెలిసింది, ఓర్పుగలిగింది, కాయకస్టం పడి కుటుంబాన్ని ముందుకు తెచ్చేది, కొడుకు పరువు, వొంశెం పరువు నిలబెట్టేది.. వోళ్ల చెల్లి కూతురైన ‘నరసమ్మే’ తగిన జోడీ అని ముడువు జేసుకొని, మా ఆందేలి తాత్తో మాటాడి పేరు ఫలాలు జూస్తే.. మా నాయిన కోడిపెట్ట, మాయమ్మ పుంజుగా వొచ్చెనంట. ‘బోయిడా పిల్లదే పైచేయి.. పిలగోడిది కింద చెయ్యే’ అనే్నడంట బాపనయ్యోరు. ‘ఎవుర్ని దెచ్చి చేసినా వోడి బగిశంతే’ అంటా పెండ్లి జేసేసినాడు మా తాత.
పెండ్లయినాంక మా యవ్వ ఆగిత్తం ఎక్కువయి పోయింది. కోడల్ని.. ‘అడక్క తింటా వుండి నోళ్లంతా మా కొంపలకొచ్చిరి. ఇంగింతే కత’ అని సాదించేదంట. యాలకి తిండి బెట్టేది కాదు. ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చేది కాదు. ఎనుముల కొటం పక్కనుండే చిన్న ఖాళీ స్తలంలోనే బట్టలు, తినే గినె్న, లోటాయి, పనుకొనేదానికి ఈతాకు సాప ఇచ్చి అక్కనే్న వుండమనేది. ‘ఎందుకిట్టా చేస్తావుండారని’ మా నాయినా అడగలేదు. ‘మన తలరాత ఇంతేనేమో’ అనుకొని మాయమ్మ గొమ్మునుండి పోయిందంట.
పెండ్లయ్యి మూడేండ్లయినా పిలకాయిలు లేరంట. అందురు ‘గొడ్రాలు’ అని అంటా వుంటే ఏడుపొచ్చి మా కుల దేవత యల్లమ్మను వేడుకొంటే సమచ్చరానికంతా మా పెద్దన్న పుట్నాడంట.. మనవడు పుట్టినందుకు సంతోసపడిన పొట్టతాత ‘నారాయుడికి కొడుకు పుట్నాడులే.. బండ కొట్టో, బండిలాగే సాకేస్తాడు’ అని చెప్తే దానికి మాయమ్మ ‘బండకొట్టి, రాళ్లు కొట్టి, బండ్లుతోలి బతకాల్సిన కర్మ మా కొడుక్కి లేదు. నా కొడుకు ఉద్యోగం చేస్తాడు’ అనిందంట. నిండు పున్నమి నాడు పుట్నాడని చంద్రశేఖరని పేరు పెట్టుకొనే్నరు.
అక్క నా పక్కనోళ్లు కారిమూస్తే.. కొడుకు పుట్నాంక ఇంట్లోకి రానిస్తా వుంది. మా యమ్మని మాయవ్వ. తెల్లార్జామునే లేసి అన్ని ఇంటి పనులూ ముగించుకొని కూలిపన్లకు పోవాల. కూలి పనులు లేకుంటే అడివికి బోయి కట్టెలు కొట్టుకురావాల. అట్లేదంటే చేన్లో పనులు మానావరిగా వుండేవి. అలిసి పులిసి ఇంటికొస్తే మా తాత రెండు పల్లు వొడ్లిచ్చి.. దంచి అన్నం చెయ్యమనేవోడు. ఇట్టా దినుమ్మూ వొడ్లిచ్చి దంచమంటా వుంటే కోపం వొచ్చేది మా యమ్మకి. ‘అదేదో ఒకేసారి అరమూట వొడ్లిస్తే మిల్లుకు పోయి దంచుకోనొస్తాను గదా’ అని అనుకొనేదంట.
యాటకూర దెస్తే మెత్తని కండలే ఏరి మా తాతకి తనీగా వొండి పెట్టాల. ఎముకల పులుసు మిగిల్నోల్లు తినాల. ఇంట్లో అందురికీ కమ్ము సంగటి, రాగి సంగటి. తాతకు మాత్రం అన్నం, నెయ్యి, పప్పు.
మా పెద్దన్న పుట్టిన మూడేండ్లకి మా చిన్నన్న గోయిందసామి పుట్నాడు. చిన్నన్న పుట్టిన మూడేండ్లకి నేను పుట్నానంట. ఆడబిడ్డ పుడతాదనుకొంటే మొగ పిలగోడు పుట్నాడని మొకం అట్టబెట్టుకునే్నడంట మా తాత. నేను పుట్టిన ఆరునెల్ల వరకు బతకతానని ఆశలేదంట ఎవురికీ.. మా ఆందేలవ్వ దర్మమాని బతికి బట్ట కట్టినానంట. నాకు ఐదేండ్లు నిండేవరకు మాయమ్మకు అడుగడుగునా గండాలు ఎదురయ్యేవని చనిపోయిన మా చిన్నాయినలు వీరుల రూపంలో కాపాడేవోళ్లని చెప్తావుంటాది మాయమ్మ.
మా ముగ్గురు అన్నదమ్ముల ఆలనా పాలనా చూసింది.. మహాతల్లి మా ఆందేలవ్వ. పిలకాయిలు ఆకలితోవొస్తే తినేది కూడా వొదిలేసి మాకు పెట్టి, నీళ్లు తాగి పనికిపోయే మా ఆందేలి తాత. ముగ్గురు పిలకాయిలయ్యేసరికి మా యమ్మకి కస్టాలు ఎక్కువై పొయినాయి. మా నాయినకేదీ పట్టేది కాదు. తిండి వుంటే సాలు.. ‘కడుపే కైలాసం’ అనుకొనేవాడు. ఆయనకి కావలసింది మాత్రం బాగా దెల్సు. మిగతా లోకంలో ఏది ఎట్ట జరిగినా పట్టించుకోడు. ఏడేండ్ల దాకా మేము మొల్తాడు తప్ప గుడ్డ గట్టింది లేదు. అదీ మా నాయిన మమ్మల్ని పట్టించుకొనేది. ఆకలేస్తే ఆందేలవ్లోళ్లింటికి పరిగెత్తేవాళ్లం.
తన బాగా శారం వొచ్చిన నేలని మా పొట్టతాత అమ్ముకుంటా వొచ్చెనంట. ఎక్కడ నేలమ్మినా మా నాయిన సంతకం బెట్టేదానికి తయారుగా వుండేవోడంట. మళ్లీ నేల నమ్మేదానికి బేరం పట్టకొచ్చిన మా తాతని తగులుకొనిందంట మాయమ్మ. ‘మొత్తం అమ్మేసి, మీ మనవల్లని బిక్షం ఎత్తుకోమంటావా..’ అని నిలేసిందట. దాంతో గొమ్మునైపోయిన మా తాత నేల నమ్మడం గురించి మర్చిపొయినాడు. ఉండే నేల్లో సేద్యం చేసి, అడపాదడపా బండ మిందకు బొయ్యి కొన్నాళ్లు రాళ్లు కొట్నాడు మా నాయిన. అయినాగానీ మా అమ్మకు కస్టాలు తప్పలేదు. బావులు తొవ్వేటపుడు మట్టి తట్ట మోసేదానికి పోతానే వుంది, రోడ్డు పనులకి, ఇండ్లు కట్టేటపుడు సిమెంటు, ఇటుక రాళ్లు, ఎత్తిచ్చేదానికి, సేద్యం కూలి పనులకీ పోతానే వుంది. మా పెద్దన్న పదో తరగతికి వొచ్చినాంక కూలిపన్లకి పోయేది వొద్దని నిలిపేసింది. బలిజ కండిగ నుండి ఆముదాల దాకా రోడ్డేసింది, వీర్లగుడి నుంచి, పత్తేలూరు దాకా కొండ అంచులో కాలువ తొవ్వింది, నీళ్ల టాంకు కట్టింది, కోన చెరువు కట్ట కటిటంది, ఎరుకంజేట్లో నీళ్ల టాంకు కట్టింది, పాసంద్రం సొసైటీ బిల్డింగు కట్టింది, చినరాజోళ్ల ఇల్లు కట్టింది, ఇప్పుడుండే పాసంద్రం మండల బవనాలు కట్టింది, కట్టిచ్చింది ఎవురో అయినా మా అమ్మ కస్టం వోటిల్లో కనిపించి, నా కండ్లు చెమ్మగిల్లతాయి. మా అమ్మ కస్టం వాటిల్లో వుంది. పుట్టినప్పట్నుంచి మా కుటుంబానికి అంకితమయిపోయిన మా అమ్మకు ఎంత సేవ జేసినా తక్కవే! ఎంత రాసినా తక్కవే! మా అమ్మకు పెండ్లయినపుడు మా చినతాత చినకన్నబోయుడు ‘అమ్మా నర్సమ్మా ఏమీ తెలీని నారాయుడిని బాగా చూసుకొని, నీ కుటుంబాన్ని నిలబెట్టి, పుట్టే బిడ్డల్ని లోకం మెచ్చేలా పెంచుకోతల్లా.. మన పెద్దోళ్లు ఎంత గొప్పగా బతికిరో అట్ట నీ బిడ్లు గూడా బతికేలా చూడాలని’ కన్నీళ్లు బెట్టుకొనే్నడంట. అందుకనే ఇన్ని కస్టాలకు ఓర్చి మా కుటుంబాన్ని గౌరవంగా నిలబెట్టింది. అందుకే మా అమ్మకు జేజే.
కథా రచయిత -రాపూరి రంగనాయకులు (చిత్తూరు జిల్లా)

రాపూరి రంగనాయకుల కథ రాసిన విధానం బాగుంది పల్లె తల్లి దృశ్యాన్ని చూపించాడు  బత్తుల ప్రసాద్ sagileru.com

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *