తంగేడు పూలతో తల్లి జ్ఞాపకం

తంగేడు పూలు
లేత కాయల కూర మేహమును, క్రిమిరోగమును, సర్వప్రమేహములను, మూలవ్యాధిని హరించును; దప్పిక నణచును; నేత్రములకుమేలుజేయును; అతిమూత్రరోగులకు పథ్యముగ నుండును.తంగేడు పూల రెమ్మల కషాయం మధుమేహానికి దివ్యౌషదం. పరగడపున 15 రెమ్మలను గ్లాసుడు నీళ్ళతో మరగింఛి ఛల్లార్ఛి సేవింఛాలి. సేవనం తర్వాత ఒక గంట వరకు ఏమీ తినరాదు.
వీటన్నిటికంటే ఒక రచయిత అమ్మ ప్రేమను తంగేడు చెట్టు జ్ఞాపకాల లో గుర్తుకు తెచ్చుకున్న విధానం చాలా గొప్పగా ఉంది.

తంగేడు పూలు (కథ)
– ఉమర్ ముఖ్తర్
ఇంటిల్లిపాదీ విహార యాత్రకు బయలుదేరారు. ప్రయాణంలో ఒకచోట విశ్రాంతి తీసుకుందామని అనుకుంటూ ఉండగానే చుట్టూ పచ్చదనం పరుచుకున్న ప్రాంతం వాళ్ళ కళ్ళను కట్టేసింది. అందరూ కారు దిగి ఆశ్చర్యంగా ఆ పరిసరాలను చూస్తూ ఉండిపోయారు.
ఎటుచూసినా బిల్డింగ్‌లు, రద్దీగా ఉన్న రోడ్లు, క్షణం తీరికలేని ఉరుకు, పరుగుల జీవితాలలో, ఆ పచ్చదనం పన్నీటి జల్లు విసిరింది. ఆ పచ్చదనమంతా ఏపుగా పెరిగిన తంగేడు చెట్లమీద విరగబూసిన తంగేడు పూలవలన అని తెలుసుకోగానే మరింత ఆశ్చర్యపోయారు. చూడగలిగే మనసుండాలి కాని, ప్రకృతిలోని ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి పూవు తనదైన రమణీయతతో కనువిందు చేస్తుంది. అడవులలో కొన్నిచోట్ల ఒకేచోట మోదుగ చెట్లు ఉన్న ప్రాంతంచూస్తే ఎలా ఉంటుంది? ఎంత అందంగా ఉంటాయి ఆ పూలు! ఏమి? ఆ తీర్చిదిద్దినట్లున్న పూరేకుల ఆకృతులు! ఏమి? ఆ రంగుల మేళవింపు. తంగేడు పూల లాగే ప్రకృతిలో ఎన్నో పూలు. దేని రంగు దానిదే! దేని ఆకృతి దానిదే! దేనిపూలరేకు నునుపుదనం దానిదే. దీనికి మరేది సాటిరాదు ప్రపంచమంతా పరుచుకున్న మానవులవలె! అదే సృష్టి గొప్పదనం.
భార్యా, పిల్లలు అబ్బురపడుతున్నారు. తంగేడు చెట్లు కూడా ఇంత అందంగా ఉంటాయా? అని. చెట్ల నిండా పూలు, పూమొగ్గలు. ఏ పూమొగ్గను స్పృశించినా పసిపిల్లల బుగ్గలే! చిరు అడవి అంతా పరుచుకుంది పచ్చదనం. ఆ పూలపైనుండి వీచిన చల్లని గాలి అతనిని బాల్యానికి తీసుకెళ్ళింది. తనకు, తంగేడు పూలకు ఉన్న సంబంధం తన కళ్లెదుట పరవశింపజేయసాగింది.
తమదో ఇల్లు. గుడిసె మాత్రమే. అయితేనేం! ప్రేమ, ఆప్యాయతలతో కట్టుకున్న పక్కా ఇల్లు. ఇరుగు, పొరుగు, బంధువులు సేదతీరే ఇల్లు. ఇరుగు, పొరుగు పిల్లలు నిద్ర లేవగానే చేరి కేరింతలు కొట్టే ఇల్లు. అమ్మ, నాన్న ఆ పిల్లలకు పంచే ప్రేమ, కష్టాల్లో ఉన్న పెద్దవారికి పంచే ధైర్యం అవన్నీ కలిస్తే అదో మధ్యతరగతి ఇల్లు.
ఇంట్లో బండెడు కట్టెలు వేయించుకుంటే కొన్ని నెలలదాకా నిశ్చింతగా ఉండవచ్చు. కానీ, బండెడు కట్టెలు కావాలంటే డబ్బుకావాలి. నాన్న సంపాదనకు చేదోడు, వాదోడుగా అమ్మ పెరట్లో కూరగాయల మొక్కలు పెంచేది. నీళ్ళు వేడిచేయాలన్నా, ఇంటిచుట్టూ ఉన్న పెరటికి కంచె వేయాలన్నా తంగేడు పొరుకే దిక్కు. అందుకే అమ్మ అడవికి పోయి తంగేడు పొరుక తీసుకువచ్చేది. అమ్మ తంగేడు పొరుక మోపుకడితే పొరుగింటి అమ్మలకు కన్నుకుట్టేది. మోపుకు మా దిష్టి తగుల్తది అని పరాచికాలాడేవారు. ఇక బడి సెలవురోజులలో అయితే పొరుగింటి అమ్మలు రాకపోయినా అమ్మ తనను తీసుకుని అడవికి బయలుదేరేది.
తంగేడు చెట్లల్లో వెదకి, వెదకి, బలంగా, నిటారుగా ఉన్నవాటినే అమ్మ కొట్టింది. ‘‘బాపూ! వంకర టింకర ఉంటే మోపుకుదరదు. సరిగ్గా వుంటేనే మోపు కుదురుగా ఉంటుంది. మోయడానికి సులువు’’ అంది తనతో. బుద్ధి వంకర టింకరగా లేకపోతేనే జీవితం కుదురుగా ఉంటుంది అన్నట్లుగా ఉంది ఆ మాట. అమ్మ చెప్పినట్లే మంచి పొరుకనే గొడ్డలితో కొట్టుకు వచ్చి అమ్మతోపాటు ఒకచోట చేర్చినాడు తను. వెంట తెచ్చిన త్రాళ్ళు విడివిడిగా కొద్ది ఎడంతో నేలపై పరచింది. పొరుక చిన్నదైతే రెండు కట్లు, పొడుగ్గా ఉంటే మూడు కట్లు. ముందు పొడుగ్గా, నిటారుగా ఉన్నవాటిని తీసి పొందికగా ఉంచి, వాటిపై మిగతా పొరుక పేర్చింది. అమ్మ ఒకవైపు, తను మరోవైపు కాలితో గట్టిగా పొరుక కుప్పను తన్ని పట్టి ఎదురెదురు త్రాటి చివర్లను పెనవేస్తే, అమ్మ గట్టిగా ముడివేసింది. మోపు లేపాలంటే అదో టెక్నిక్. పొడవాటి గుడ్డను చుట్టగా చుట్టి తలపై పెట్టుకుని మోపు గరిమనాభిని అంచనావేసి తల అక్కడ ఆనించమంది. ముందుకు వంగి రెండు చేతులతో మోపునకు సపోర్టు ఇస్తూ ఒక్క కుదుటుతో లేపి ముందుకు నడవమంది. ఏమాత్రం ముందుకు, వెనుకకు అయినా రెండు చేతులతో మోపును సర్దుకుని, తలను ముందుకు గాని, వెనుకకు గాని జరిపి సర్దుకోమంది.
మోపు సరిగ్గాలేకపోతే, పేర్చకపోతే ముందుభాగం ముందుకీ, వెనుక భాగం వెనక్కీ విరిగినట్లు అవుతుంది. రెండు భాగాలు విడి, విడిగా ఊగుతూ వుంటాయి. ఆ మోపు తలకు, వెన్నుపూసకు భారం కూడా. అందుకనే అమ్మ మోపును బ్యాలన్స్‌గా పేర్చింది. అమ్మ పేర్చిన మోపు, బాధ్యతలను ఎంత బ్యాలన్స్‌గా నిర్వర్తించేదో చెబుతుంది. అదే తనకు కూడా నేర్పింది.
తను ఉంటే అమ్మకు కొండంత ధైర్యం అమ్మ ఉంటే తనకు జగమంత ధైర్యం. అమ్మ మోపు పెద్దగాను, తనకు వేసే మోపు చిన్నగా ఉండేట్లు చూసేది. తనకు ముందుగా ఎత్తి, మొదళ్ళవైపు పట్టి పైకిలేపింది. రెండడుగులు వేసి బ్యాలన్స్ అవుతుంటే బాపూ! మోపు సరిగ్గా ఉందా? నడవగలవు కదా? అని అడిగింది అమ్మ. తదుపరి అమ్మ స్వయంగా తంగేడు పొరుక మోపును లేపుకుని తలపై చుట్టమీద ఒద్దికగా పెట్టుకుని బయలుదేరింది. కొద్ది దూరం తనముందు అమ్మ, కొద్ది దూరం అమ్మ ముందు తను. అమ్మముందు నడిచేది దార్లో ఎత్తుపల్లాలు ఉన్నప్పుడు. ఎత్తుపల్లాలు రాగానే అమ్మ తనను ఆపింది. అమ్మ ముందు దారితీసేది. పడితే తనకేంకాదు అనే మొండి ధైర్యం. తన బాపుకు ఏం కాకూడదనే తల్లిప్రేమ. రాళ్ళమధ్య ఎగుడు, దిగుడు ఉన్నచోట అడుగు ఎక్కడ వేయాలో అమ్మకు తెలుసు. తలపై మోపుతో అడుగు ఎక్కడ వేయాలో చూడటం సాధ్యంకాదు. మెడ నిటారుగా ఉంటే అంచనా వేయాలి. మోపును బ్యాలన్స్‌చేస్తూ అడుగు ఎక్కడ వేస్తుందో జాగ్రత్తగా గమనించి తనను అక్కడే అడుగువేస్తూ వెనకాలే రమ్మనేది. అవును! అవే అమ్మ అడుగుజాడలు. బుడి, బుడి నడకలు నేర్పిన అడుగుజాడలు. ఇక నడుస్తూ ఎగుడు, దిగుడుగా ఉన్నచోట వెనక్కి తిరగడం కుదరదు. తలపై మోపుతో వెనక్కి తిరిగి చూడాలంటే మొత్తం మోపుతో వెనక్కి తిరగాలి. అడుగడుక్కి అలాచేయడం అయ్యేపని కాదు. అందుకు అమ్మ తనను మధ్యమధ్యలో బాపూ! బాపూ! అని ఒకటికి రెండుసార్లు పిలుస్తూ ఉండేది.
గుట్టదాటినాక చదును వచ్చిందీ అంటే అమ్మ తనను ముందు నడిపించింది, ఇక ప్రమాదం లేదన్న భరోసాతో. ముందడుగువేసే స్వాతంత్య్రం ఇచ్చినట్లుండేది. గమ్యం దూరంగా కనపడుతుంటే అధైర్యపడకుండా గమ్యాన్ని విభజించింది. ఫలానా చెట్టు వచ్చేసింది అని, వాగు దాటినాము అని, జామాయిల్ తోట మలుపు దాటినాము అనీ చెప్తూ ఉండేది.
అమ్మ అట్లా మాట్లాడుతూనే ఉంది ఎడతెరిపి లేకుండా. మొదట్లో అర్థమయ్యేది కాదు ఎందుకు అలా దారిపొడవున మాట్లాడుతుందో! అమ్మ ఎంత ప్రేమగా ఉండేదో! అంత ఆర్ద్రతగానూ ఉండేది. పని విషయానికి వస్తే గాంభీర్యం. అడవికి పోవడం, ఇలా టాపిక్‌లమీద టాపిక్‌లు అమ్మ మాట్లాడటం, ఇదంతా బరువు తెలియకుండా మాటల్లో పెట్టడానికే అనే సంగతి కొన్ని నాళ్ళకు కాని తెలియలేదు. తనకు తెలియకుండానే ఇల్లు చేరడం, అమ్మ టెక్నిక్ అన్నమాట.
ఇంకా, బరువుగాతోస్తే దార్లో ఒకటిరెండుచోట్ల ఆగమనేది. మధ్య మధ్యలో బరువుగా అనిపించట్లేదు కదా! బాపూ! అని అడిగి, అవసరమైతే విశ్రాంతి తీసుకోవాలి అనేది. కొద్దిసేపు ఏ బండమీదనో, మొదలు నరికిన చెట్టు మొద్దు మీదనో కూర్చుని వెంట తీసుకుపోయిన నీళ్లు త్రాగాలి. నీటిని పొదుపుగా వాడుకుంటూ గొంతెండి పోకుండా చూసుకోవాలి. అయినా, బరువుగాతోస్తే అదిగో ఇల్లు, ఇంకా రెండేరెండు అడుగులు అంటూ ఉత్సాహం నింపేది. అమ్మకు బరువుకంటె లక్ష్యంమీద ధ్యాస ఎక్కువ. ఇంటి పెరట్లో మెట్టెవేస్తే అది పెరుగుతూ ఉండాలి. చక్కగా, నిటారుగా ఉన్న తంగేడు పొరుక కంచెకు అయి, మిగిలింది వంట చెరక్కు. అందుకే ఎంత పెద్ద మోపు అయితే లక్ష్యం అంత తొందరగా నెరవేరుతుంది అని పెద్దమోపు వేసుకునేది. అదిగో ఇల్లు రానే వచ్చింది, తొందర తొందరగా నడు! వంటి మాటలతో ఉత్సాహం పొంది అమ్మకంటె చాలా ముందుకు రానే వచ్చినాడు. అమ్మకు ఎదురెళ్ళి అమ్మ మోపును తీసుకోవాలనే పట్టుదల వేగాన్ని పెంచడంతో ముందుగానే ఇల్లుచేరేవాడు. ఇంటిముందు మోపువేసి గబ, గబ కొన్ని నీళ్ళు త్రాగి చెంబులో నీళ్ళతో ఎదురెళ్ళి అమ్మకు అందిస్తే, ఆ నీటిని అమృతంగా తాగేది. అవును, పనిచేసి, పనిచేసి గొంతెండి పోతుంటే గొంతుదిగే ప్రతి నీటి చుక్క అమృతమే. నేటి ఏ ప్యాకేజి డ్రింకింగ్ వాటర్, ఏ మినరల్ వాటర్, ఏ ప్యూరిఫైడ్ వాటర్, ఏ కూల్‌డ్రింక్ దానికి సరికాదు. కడుపు నిండా నీళ్ళు త్రాగి అమ్మ బాపూ! అని తనను పిలిస్తే తనకెంతో తృప్తి. అమ్మ చేతి వంట ఆం…ఆం… అని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే, కేరింతలు కొడుతూ తను తిన్నపుడు అమ్మ కళ్ళలో అదే తృప్తి. తృప్తిగా అమ్మ తన వంక చూస్తే వెయ్యి ఏనుగుల బలం. అమ్మ మోపుతీసుకుని మోస్తుంటే తనకు ఇప్పుడు బరువుగా లేదు. ఇల్లు చేరారు. ఇంటిముందు రెండుమోపులు అక్కడక్కడ చిక్కిన తంగేడు పూలు మురిపిస్తున్నాయి. కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని అమ్మ సేద తీరుతుంటే, తనేమో ఆ పూలను, మొగ్గలను కోసి అమ్మ చెంత చేరి అమ్మకు ఇచ్చి, పక్కగా కూర్చుని తనూ సేదతీరాడు.
తంగేడు పూలు సుగంధ పరిమళాలు వెదజల్లక పోవచ్చు. కానీ అమ్మ అనుభవసారాన్ని పరిమళిస్తున్నాయి. ఇప్పుడు అమ్మ అనుభవసారమే తంగేడు పూలై పలుకరిస్తున్నాయి. పుట్టిన జీవికి మరణం తప్పదు. పుట్టిన మనిషి ఏ క్షణాన చనిపోతాడో, ఎక్కడ ఏ ప్రదేశాన చనిపోతాడో చెప్పడం ఎవరివల్లాకాదు. పొయ్యిమీద అన్నం వండుకుని, ముఖం కడుక్కుంటుంటే తన వారెవ్వరు భరించలేరు అనేమో! వారెవ్వరు దగ్గర లేని క్షణాన అమ్మ తనువు చాలించింది. ఎంతటి కష్టకాలంలోనైనా నిబ్బరంగా, ధైర్యంగా కొండలాగా నిలుచున్న అమ్మ మరణానికి మాత్రం తల వంచక తప్పింది కాదు. అమ్మకు కష్టమే తెలుసు. ఆ కష్టంలోని తియ్యదనం తెల్సు. కష్టాన్ని కష్టం అనుకోలేదు. కష్టానికి భయపడనూ లేదు. పగలు, రాత్రి ఎంత సహజమో! కష్టము, సుఖము అంతే అనుకుంది. జీవితంలో భాగం అనుకుంది.
అయితే తమకు సుఖం ఇదీ! అని తెలిసేవరకు అమ్మ ఎంత కష్టపడిందీ తెలిసి వచ్చింది. కష్టాల కాలందాటి సుఖపడే కాలానికే అమ్మపోయింది. నాకు అమ్మకు ఉన్న కష్టాన్ని దూరం చేయాలి అనే ధ్యాస, పట్టుదలే తనను ఇంత స్థాయికి ఎదిగేలా చేసిందేమో! అమ్మ ప్రేమను పొందిన ఎవరైనా ‘అమ్మ’ అనే రెండు అక్షరాలు తలుచుకుంటే చాలు, రెండు అక్షరాలకు గుర్తుగా రెండు కళ్ళు రెండు కన్నీటి చుక్కలైనా జాలువార్చవా? అమ్మ తన జీవితాన్ని కుటుంబానికే వెచ్చించింది. మాట నేర్పింది, అడుగులు నేర్పింది. బాధ్యతలు, బరువులు ఎలా నిర్వర్తించాలో నేర్పింది. అమ్మ నేర్పనిది ఏమిటి? జీవితపు ప్రాథమికాలను నేర్పి, భావిజీవితానికి పునాదులు వేసింది. పనిని ప్రేమించటం నేర్పింది. కృషి, పట్టుదల, త్యాగాలను నేర్పింది. అమ్మ ఒడి, పిల్లల మొదటి బడి. అమ్మను మించిన గురువెవ్వరూ లేరు ఈ లోకంలో.
అమ్మ వేసిన తంగేడు పొరుక వంట చెరుకై అమ్మ చేతి వంటకు రుచిని చేర్చిందా. ఇంటికి అమ్మలా, పెరటికి కంచె వలె నిలబడి మొక్కలకు రక్షణనిచ్చింది. నేడు విరగబూసిన తంగేడు పూలతో అడవికి అందాన్ని పంచింది. తనను మూగగా పలకరించింది.
బాపూ! అన్న పాప పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. అప్రయత్నంగా తన రెండు చేతులు ముందుకు కదిలి తంగేడు పూలతో నిండుగా ఉన్న రెండు చిన్ని కొమ్మలను తృంచి పాపకు అందివ్వబోగా… కంటినుండి రాలువడిన కన్నీటిచుక్కలు తంగేడు పూలపై పడి ‘బొకే’లో అమర్చిన ముత్యాల్లా మెరుస్తున్నాయి.
పాప చిరునవ్వుతో తన చేతిలోని బొకే అందుకుని, మరో చేత్తో తనను పట్టుకుని కారువైపు అడుగేసింది. పాప అడుగుజాడలు కన్నీటి పొరతో నిండిన కళ్ళల్లో మసకగా కనపడుతుంటే ఆ అడుగుజాడల్లో అడుగువేస్తూ ముందుకు కదిలాడు, హృదయం నిండుగా వెయ్యి విహార యాత్రల ఆనందంతో!

రచయిత చిరునామా:
మహ్మద్ రహీముద్దీన్,
డి-53, నాగార్జున, గౌతమీనగర్,
(పిఓ) హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ,
(ఎంఓ) అశ్వాపురం- 507116. ఖమ్మం జిల్లా. *

పల్లె జీవితం లో ప్రతి ఒక్కరికీ ఇలా ఏదో ఒక్క దానితో అనుబంధం ఉంటుంది. అదే పల్లె తల్లి గొప్పతనం  ఈ కథ రాసిన మహ్మద్ రహీముద్దీన్ గారు నా బాల్యాన్ని అమ్మను గుర్తుకు తెచ్చారు. అతడికి తడి బారిన మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

-బత్తుల ప్రసాద్

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *