నేను రాసిన గంజిబువ్వ కథపై సమీక్ష

నేను రాసిన గంజిబువ్వ కథ పునీతమైంది అని చెప్పడానికి కనక ప్రసాద్ గారు రాసిన ఈ విమర్శనాత్మక సమీక్ష చాలు. నా జీవితంలో నేను మా నాన్న జ్ఞాపకం కోసం రాసిన ఈ కథ గురించి వచ్చిన ఇంత పెద్ద సమీక్ష …. మా నాన్నకు నేను ఇచ్చిన ఓ నూలు పోగుగా భావిస్తున్నాను….

ఇది కనక ప్రసాద్ అనే ఒక విమర్షకారుడు మూడు లాంతర్లు అనే సైట్ లో ఏదో వ్యాసం మధ్యలో అతను నా గంజిబువ్వ కథ గురించి ప్రస్థావించాడు ఇలా…
ఇది మొదలుపెట్టే సమయానికే ఒక అదృష్టం లాగ బత్తుల ప్రసాద్ గారి కధ – గంజిబువ్వ అని దొరికింది. ఇది చదివి నేను పొంగిపోయేను, కులికి సస్తున్నాను. కపటం లేని కాల్పనిక ధార అని నేననుకునేదానికి ఇది ఒక ఉదాహరణ. బలమైన సృజన కవి నుండి అతని పాఠకునికి ఎలా ప్రసారమౌతుందో ఈ కధను ఉదాహరణగా, ప్రాతిపదికగా వివరించి చెప్పవచ్చు. బత్తుల ప్రసాద్ కవి. చదివేవాడు పాఠకుడు. ఇల్లు వీళ్ళిద్దరికీ ముందు జాంతవమైన అవసరం, ఆ పైన మానసికమైన అవసరం, అంటే Home. తండ్రి పిల్లల్ని సాకే ప్రేమ వీళ్ళిద్దరికీ తొలుత పిల్లలుగా తరువాత తామే తండ్రులుగా ముందు జాంతవమైన అనుభవం, ఆ పైన సాంస్కృతికమైన అనుభవం.

అదే  కనక ప్రసాద్ గారు మూడు లాంతర్లు అనే వెబ్ సైట్ లో గంజిబువ్వ కోసం రాసిన ప్రత్యేక సమీక్ష ఇది…

గంజిబువ్వ వంటి ఏ సృజనైనా ఒక రూపుదిద్దుకొని పాఠకుడికి అనుభవంలోకి వచ్చే ప్రక్రియను ప్రభావితం చేసే అంశాలు ఐదు. కవి అంతరంగంలో కల్పనగా రూపుదిద్దుకొన్న అనుభవాలు, పరిశీలనల ప్రతీక; అంతకు మునుపే అతనికి అనుభవమైన జీవితం; కధ పాఠం; పాఠకుని అంతరంగంలో పునర్మించుకున్నది ఆ కధదే తనదైన ప్రతీక – అంటే నమూనా; పాఠకుడు ఈ కధ పరిచయం కాకముందు అనుభవించి ఉన్న జీవితం. ఈ ఐదింటిలో సృజన పాఠం కాక మిగిలిన నాలుగూ కవికి, ఆయన పాఠకునికీ ఆంతరంగికమైనవి, చాలా వ్యక్తిగతమైనవి. ఈ నాలుగింటికీ ఎంత ప్రగాఢంగా సమన్వయం కుదురుతున్నాదో ఆ మేరకు ఆ సృజన ఆ పాఠకుడికి అందుబాటులోకి వస్తున్నాది, ఆకట్టుకుంటున్నాది, లేదూ అంతకంటే తీవ్రంగా కుదిపేస్తున్నాది. అలాగే ఈ నాలుగింటి నడుమ ఏ మేరకు సమన్వయం కుదరలేదో ఆ మేరకు ఆ సృజన ఆ పాఠకునికి లభ్యం కాలేదు, ఆకట్టుకోలేదు, లేదూ అంతకంటె తీవ్రంగా అసహ్యం, రోత, హేళన వంటి విరుద్ధ భావనల్ని కలిగిస్తుంది.

ఈ ఐదింటిలో మూడు కధ ప్రచురించేటప్పటికే స్థిరమైపోయినవి, మరి మార్చగలిగేవి కాదు. అవి – కధ పాఠం, కవి ఆంతర్యం, ఆయన జీవితానుభవం. మిగిలిన రెండూ, అంటే పాఠకుని జీవితానుభవం, అతని ఆంతర్యం మాత్రం తాత్కాలికమైనవి. అదే కధను అదే పాఠకుడు ముందుకి చదివేనాటికి మారిపోయే అవకాశం ఉన్నవి. ఇంకా, ఈ మొత్తం అనుభవంలో తర్కబద్ధమైన భాష పాత్ర కేవలం సృజన పాఠానికే పరిమితమై ఉంది. మిగిలిన సృజనానుభవాన్ని నిర్వహించేది ప్రధమంగా తర్కబద్ధమైన భాష కాదు – అంటే నిఘంటువు, వ్యాకరణము, ఛందస్సు వంటి నియమాలకు పూర్తిగా బద్ధము, విధేయమైన భాష కాదు. అది ప్రధమంగా ఔద్వేగికమైన భాష. సృజనల ప్రసార అనుక్రమణికను, అనుభవాన్నీ వివరించే ఈ ప్రయత్నానికి ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. వీటి వివరాల్లోకి పోయే ముందు స్థూలమైన ఈ ప్రతిపాదనను గంజిబువ్వకు అన్వయించి చూపించి అది నాకెందుకంత నచ్చిందో పట్టి చూసుకోవచ్చు. అది గంజిబువ్వ గురించి విశ్లేషణ అవుతుంది తప్ప, విమర్శ కాబోదు. విమర్శ ఊసు వస్తే సృజన పాఠాన్ని, శయ్యను, ఎత్తుగడను, అంగాల పొందికను, భాషను, దృక్పధాన్ని, గొంతును ఇలా ఎన్నో అంశాలను వివరంగా పరామర్శించవలసి ఉంటుంది. అంతేకాక మొత్తం సారస్వత సమాజపు పఠనానుభవాన్ని పురస్కరించుకొని చర్చించవలసిఉంటుంది. ఆసక్తి ఉంటే అది చాల విస్తారమైన పని. ఇప్పటికిది వాటన్నిటికీ కొంత ఎడంగా, ఒక కధ ఒక పాఠకుడి అనుభవంలోకి ఎలా వచ్చిందన్న అనుశీలన మాత్రమే.

గంజిబువ్వ చదివి కవి జీవితాన్ని గురించి, కధ రూపుదిద్దుకుంటున్నప్పటి ఆయన ఆంతరంగిక స్థితిని గురించీ ఊహించవచ్చు. ఒక పిల్లల తండ్రి పెద్దబ్రామయ్య అనే మిషనరీ స్కూల్ మేష్టారబ్బాయి, సుమారు ముప్ఫయ్యేళ్ళ క్రితం గాలీవానా వస్తే చర్చి కాంపౌండ్‌లోని తమ ఇల్లు ఎలా కారిపోయి, గెడ్డలోకి కొట్టుకుపోబోయినంత పనైందో తల్చుకుంటున్నాడు. ఆ వానల్లో తనకి నాన్న వండిపెట్టిన గంజిబువ్వని ఇప్పుడు గుర్తుకుతెచ్చుకుంటున్నాడు. ఇలా కధలో మనతో మాట్లాడుతున్న అబ్బాయి ‘బత్తుల ప్రసాద్’ కాదు. ఆయన సృజించిన ఒక పాత్ర, అంతే. అలాగే పెద్దబ్రామయ్య నిజంగా బత్తుల ప్రసాద్ నాన్నగారనీ, చిన్నబ్రామయ్య నిజంగానే ఆయన సహచరుడనీ ఇలా ఊహించుకోలేము. అందుకు వాస్తవమైన ప్రపంచంలోనివి ఆధారాలేం పాఠకునికి లభ్యంగా లేవు. ఒకవేళ కధలోని పాత్రల పేర్లు నిజ జీవితంలోని మనుషుల పేర్లే అయినా సరే, వాళ్ళు వాస్తవంగా, అచ్చంగా ఆ మనుషులే అనీ అపోహ పడకూడదు. బత్తుల ప్రసాద్ వెనకటికి బహుశ ఇలాంటి కారిపోయే ఇళ్ళనీ, ఆగకుండా కురిసే జడివానల్నీ, కొట్టుకొచ్చే గెడ్డల్నీ స్వయంగా అనుభవించే ఉంటారు. కాని అవన్నీ ఏక కాలంలోనే, అంటే అచ్చం కధలో జరిగినట్టే, అనుభవించి ఉంటారని కూడా మనం ఊహించుకోకూడదు.
ఎందుకంటే కవి ఇప్పటికే విస్తారమైన తన జీవితానుభవంలోంచి అక్కణ్ణించి కొన్నీ ఇక్కణ్ణించి కొన్నీ ఘటనలూ, మాటలూ, పరిసరాలూ, దృశ్యాలూ, అనుభవాలూ, సంభాషణలూ ఇలా సేకరించుకొని, ఎక్కడ అమిరే అంశాన్ని అక్కడ పొదిగి ఇప్పటి తన అంతరంగంలోని సృజన శిల్పపు ప్రతీకను నిర్మించుకుంటున్నాడు. అది ముందు, ప్రధానంగా ఒక కల్పన. ఈ అంశాలన్నీ అతని వాస్తవ జీవితంలోనివే కానక్కర్లేదు. కవి ఊహాశక్తి కొద్దీ ఇవి అతనికి అందుబాటులో ఉన్న కాల్పనిక ప్రపంచాలు, అంటే ఇదివరకు విన్న మాటలు, చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, చేసిన ఊహలు, కన్న కలలు – వీటన్నీంటినుండి కూడా లభ్యం కావచ్చు. ఉదాహరణకు గారెట్ (George P. Garrett) అని అమెరికన్ రచయిత నవలలు Elizabethan Trilogy అని, అవి ఒకటవ ఎలిజబెత్ రాణి వంటివాళ్ళ ప్రాచీన కాలాన్ని, పరిస్థితుల్నీ యదార్ధంగా చూసినవే చెప్తున్నాడా అని పాఠకులు భ్రమించేలా ఉంటాయని పేరు. (”… a body of work that is so imbued with its subject matter and time as to create the sense that he lived through it all, and had total recall of life in the respective courts of Queen Elizabeth the first, and James the first.”) ఆయన సమకాలికుడు, కాల్పనిక సృజన అంతర్గత స్వరూపాన్ని పరిశీలించటంలో చాల ఆసక్తిని, ప్రతిభను కనపరిచినవాడు గార్డ్‌నర్ (John C. Gardner Jr.) అని ఉండేవాడు. ఆయన కాల్పనిక సృజనకు ఈ కల్పనా చాతుర్యమే ప్రధానమైన అవసరమని ప్రతిపాదించి, అది ఎలా వాస్తవ ప్రపంచాన్నుండే కాక ఇంకెన్నో, అంతకంటే భిన్నమైన, లోతైన ప్రపంచాల్నుండీ ఆవిర్భవించే అవకాశం ఉందో సునిశితంగా చేసిన పరిశీలనలున్నాయి.

ఇప్పటికి ప్రస్తుతమైన విషయాలలో ఒకటి ఏమిటంటే గంజిబువ్వ అనే సృజన బత్తుల ప్రసాద్ వ్యక్తిగతమైన, వాస్తవమైన జీవితానుభవాలు, పరిశీలనల సంచయం వలన ప్రగాఢంగానే ప్రభావితమై ఉంటుంది. సుమారు ముప్ఫయ్యేళ్ళుగా ప్రోవైన ఈ అనుభవాల సంచయం ఆయన అంతరంగంలోన ఉడికుడికి పరిపక్వమై, ఈ నాటికి గంజిబువ్వగా అనివార్యంగా పైకొచ్చింది. సృజన అంతశ్చేతనలో సుళ్ళు తిరిగి తిరిగి, చివరికి ఏదో ఒకనాటికి తెల్లమై వెలికివచ్చే ఈ క్రమాన్ని కార్ల్ యుంగ్ (Carl G. Jung) ఎలా వివరించిందీ ముందుకి చెప్పుకోవాలి. రెండవది ఏమిటంటే గంజిబువ్వ తాను ఆవిష్కరిస్తున్న కాల్పనిక ప్రపంచం రచయిత ఎరిగున్న నిజమేననీ, ‘జూటా’ కాదనీ పాఠకుణ్ణి బలంగా ఒప్పించటంలో సఫలమౌతున్నాది. అందరు పాఠకుల్నీ అవునో కాదో గాని, కనీసం ఈ ఒక్క పాఠకుడ్ని. అయితే ఇక్కడ పాఠకుడు తనకు తనే చేసుకొనే హెచ్చరిక ఏమంటే బత్తుల ప్రసాద్ ఇప్పటి జీవితాన్ని గురించి ఈ కధ వాస్తవంగా పట్టిస్తుందని అనుకోలేము. ఆయన ఇప్పటి జీవితం, భాష, పరిసరాలు, వ్యవహార శైలి ఈ కధలో కల్పించిన ప్రపంచం లాగనూ ఉండొచ్చు, అంతకంటె చాలా భిన్నంగానూ ఉండొచ్చును. దీన్లో ఏది వాస్తవమో వేరేగా కనుక్కోవాలి తప్ప ఈ కధను చదివే కనుక్కోగల అవకాశం లేదు. అవసరం కూడా లేదు. పాఠకునికి సంబంధించినంతవరకు కేవలం ఈ ఒక్క కధే చాలా అపురూపమైన ప్రపంచాన్ని తనకు ఆవిష్కరించి ఆ కధనీ, కధలో మనుషుల్నే కాకుండా సృజనకారుడైన నిజం బత్తుల ప్రసాద్‌ని కూడా అభిమానించేటట్లు చేసుకున్నాది.

ఎంచేత? ఎలాగ? గంజిబువ్వను చూసేనాటికి పాఠకుడి మన:స్థితి ఏమిటి? అతని గత జీవితం ఏమిటి? ఇవి చెప్పుకొనే ముందు పైన చెప్పిన ‘సమన్వయం’ అంటే ఏమిటన్నది కొంత చెప్పుకోవాలి. సారస్వత కళలకు (Language Arts) సంబంధించినంత వరకు ఈ సమన్వయం అనేది ఒకరకమైన అనువాదం వంటిది. అనువాదం ఎప్పుడు సఫలమౌతుంది? చెప్పేవాడి భాష వినేవాడికి ఏ కొంతైనా అదివరకే వచ్చి ఉంటే కదా సఫలమౌతుంది. కాల్పనిక సృజన కవినుండి పాఠకునికి ‘అనువదింప’బడటానికి ఇది వరకు చెప్పుకున్న బింబ ప్రతిబింబ ప్రక్రియలలో అక్కరకు వస్తున్నది కేవలం వ్యావహారిక భాష కాదు, అది ప్రధమంగా ఔద్వేగిక భాష. ఇలాగని ప్రతిపాదించినవాళ్ళు చాలామందే ఉన్నారు. ఒక ఉదాహరణగా జెస్సీ ప్రిన్స్ (Jesse J. Prinz) అని వైజ్ఞానికుడున్నారు. ఆయన ఏమంటున్నారంటే సృజనానుభవం (aesthetic experience) అనేది ప్రధానంగా ఉద్వేగాలతో (emotions) ముడిపడి ఉంటుందని. ఇలాగే When is Art? అనీ, The language of art అనీ విశేషమైన పుస్తకాలున్నాయి. ప్రస్తుతానికి స్థూలంగా వీటి ప్రతిపాదన ఏమిటంటే వ్యావహారిక ప్రపంచపు తార్కిక భాషకు, కళా ప్రపంచపు మార్మికము, ప్రతీకాత్మకము, ఉద్వేగ ప్రధానమైన భాషకు సమన్వయం కొంతవరకే ఉండొచ్చు, లేదూ అసలు ఉండకుండా పోవచ్చు. ఈ నిర్ధారణలు విశేషంగా పరిశోధించి చేసినవి కాబట్టి వాటి వివరాలైతే వేరేగా చెప్పుకోవాలి.

గంజిబువ్వ సృజించిన ఔద్వేగిక స్థితితో సమన్వయం కావటానికి నాకు కలిసొచ్చిన అనుభవాలేమిటి? కధలోని భాష కనీసం నా చిన్ననాటి భాషైనా కాదు, ఇప్పుడైతే మేము తెలుగే మాట్లాడుకోము. ఈ కధను మొదటిసారిగా చూసినప్పుడు నేను ఫిలడెల్ఫియాలో ఒక హోటల్ గదిలో ఉన్నాను. అక్కడా వాన పడుతున్నాది. పైకప్పు కారే అవకాశం లేదు, చలివేసే అవకాశం లేదు. కాని నాకు జడివానలకి ఇంటి కప్పు కారుతూ చెక్కసున్నాలు రాలిపడుతుంటే మా నాన్నతో కలిసి వాన్నీళ్ళు కారని మూలలు వెదుక్కుని ముడుచుకు పడుకున్న అనుభవం ఉంది. అలాటి వాన రాత్రుళ్ళు కధలో అబ్బాయికి పెద్దబ్రామయ్య అన్నం కూరా అన్నీ కలిపి ఒకటే బువ్వ వండినట్టే మా నాన్న నాకు, మా అన్నకి వండిపెట్టిన అనుభవం, దాన్ని మేము ‘శెతుర్లు’ అంటే మా భాషలో ‘ఇగటాలు’ ఆడుకుంటూ ఆబగా తిన్న అనుభవం ఉన్నాయి. కధలోని మిషనరీ స్కూల్ కాంపౌండ్ ప్రపంచం అంతా, అన్నీ నేను పెరిగిన పరిసరాలే. కధలోని మనుషులు – బహుశ దళిత్ క్రిష్టియన్స్ – నాకు చాల ఆప్తులైన చిన్నప్పటి స్నేహితులు. ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగా మాత్రం మిగిలిపోయినవాళ్ళు. వాళ్ళని వెదుక్కుంటూ ఆ ఊళ్ళకి, పరిసరాలకీ వెళ్ళి ఎవరూ లేని ఖాళీ గదుల్నీ, చర్చిల్నీ చూసి నిరాశపడి వెనక్కొచ్చీసి కూడా, ఇంకా ఆశ చావక కొన్నాళ్ళకి మళ్ళీ అక్కడికే వెళ్ళి, మళ్ళీ వాళ్ళందర్నీ వెతుక్కుంటుంటాను. వరదల్లో గెడ్డలో ఇళ్ళు, సామాన్లు కొట్టుకుపోవటం మావాళ్ళకి అనుభవం ఉందని నాకు అనుభవం ఉంది. కధలో పేరులేని సన్నబిల్లోడు వాళ్ళ నాన్న తనకి వండి పెట్టినట్టే ఇప్పుడు తను తన పిల్లలకి ఎలా వండిపెడుతున్నాడో అలాగే నేను కూడా ఈనాడు మా నాయన మాదిరి నా పిల్లోల్లకు వండిపెడతా ఉంటి. దీన్ని మేము Daddy Baby Festible అంటాము. కాలం ఆకలికి వాళ్ళ నాయన లాగే మా నాన్నా కాలమైపొయినాడు. ఇన్ని కలిసొచ్చేయి.

ఇంకా ఉన్నాది. బత్తుల ప్రసాద్ సృజించిన సన్నబిల్లోని ప్రపంచం నా అంతరంగంలోని చిన్నపిల్లడి ప్రపంచం ఒకటే. వానమోత మోగుతాంటె సన్నబిల్లోడు మంచం దిగి ఒంటేలికి పోసుకుందామని శెత్తిరి తీసుకొని జాలాడిలోకి పోతాడు. నా అంతరంగంలోని చిన్నపిల్లడు అలాక్కాకుండా, గిడుగు తీసుకుని పంచాదిలోకి వెళ్తాడు. నాకు శెత్తిరి అంటే ఏమిటో తెలీదు, జాలాడి అంటే ఏమిటో తెలీదు. కాని ఔద్వేగిక ప్రపంచాల సమన్వయానికి, ఐక్యతకూ భాషా తర్కము, వ్యాకరణము, నిఘంటువూ అడ్డు రాలేదు. వైయాకరణి దృష్టితో చూస్తే గంజిబువ్వ నిండా అడుగడుగునా ‘గ్రామర్ మిష్టేక్స్’ ఇంకా ‘స్పెల్లింగ్ మిష్టేక్స్’ ఉన్నాయి. వాటన్నిట్నీ పరిహరించివేస్తే భాషకు న్యాయం జరుగుతుంది కాబోలు గాని సృజన అందమే చెడూరుకుంటుంది. నా దృష్టి అదికాదు; అందుకే గంజిబువ్వ రుచికి భాష, వ్యాకరణం అడ్డురాలేదు. బత్తుల ప్రసాద్ తన cognitive apparatus నుండి ఏ ఏ సరంజామాను ప్రోదిచేసుకుని ఈ సృజనను నిర్మించేరో ఆ సరంజామా అంతా దాదాపు నా అంతరంగంలోనూ ఉంది. కధ చదవటం మొదలుపెట్టగానే ఈ ఐక్యత కొట్టొచ్చినట్టు స్పష్టమై, చదువుతున్నకొద్దీ మరింతగా నాలో నేనే అదివరకే ఎన్నో ఏళ్ళుగా పునర్నిరించుకుంటున్న నా ప్రపంచంలోనికే నన్ను, నా ధ్యాసనూ తప్పనిసరిగా ఈడ్చుకొనిపోయి తన ప్రపంచంతో నా ప్రపంచాన్ని తాదాత్మ్యం చేసుకోగలిగింది. చదవటం పూర్తయ్యేక ఈ ప్రపంచమే గంజిబువ్వ నుండి స్వీకరించినవి కలుపుకొని మరింత ఐక్యము, సుసంపన్నమయ్యింది. అందుకే ఈ సృజన మరి నాకు అంతగా ఎక్కింది.

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *