పులస చేపల పులుసు తయారీ విధానం

పులసలు రెండు రకాలు. పోతుపులస, ఆడపులస. ఆడపులస నే ‘శనగ పులస’ అని కూడా అంటారు. గోదారిలో మిగిలిన ప్రాంతాల్లో కన్నా, రాజమండ్రి దగ్గర దొరికిన పులస ఎక్కువ రుచిగా ఉంటుంది. మరి ఇంత ఖరీదైన పులస తో రుచికరమైన పులుసు పెట్టడం అంత సులువేమీ కాదు. పులస చేపతో పులుసు చేయడానికి ముందు పులసకి ఉన్న పొలుసులు తీసేసి శుభ్రం చేయాలి. చేదుకట్ట తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేకలూ, అల్లం, జీలకర్రా, ధనియాలూ కలిపి ముద్దగా నూరుకుని పక్కన పెట్టుకోవాలి. గుప్పెడు పొడవాటి మిరప్పళ్ళు ముతగ్గా దంచి వేరుగా పెట్టుకోవాలి. వెడల్పుగా, లోతు తక్కువగా ఉన్న గిన్నె (వీలయితే మట్టి దాక) స్టవ్ మీద పెట్టి అందులో నువ్వుల నూనె పోయాలి. నూనె సెగ వచ్చేలా కాగాక నూరి ఉంచుకున్న ముద్దలు ఒక్కొక్కటీ వేసి దోరగా వేయించాలి.లేత కొబ్బరి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి గిన్నెలో పోయాలి. అలాగే టమాటా పళ్ళని చిదిమి గిన్నెలో వేయాలి. లేత బెండకాయ ముక్కల్ని పొడుగ్గా తరిగి పులుసులో వేశాక, ఒక్కొక్క చేప ముక్కనీ జాగ్రత్తగా పులుసులో మునిగేలా జారవిడవాలి. గిన్నెమీద జల్లిమూత (చిల్లులున్నది) పెట్టి మంట పెంచాలి. కుతకుతా ఉడుకుతూ బుళుకు బుళుకు మనే చప్పుళ్ళు చేస్తుంది పులుసు.పులుసు నుంచి కమ్మటి వాసన రావడం మొదలవ్వగానే మంట తగ్గించి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. చాలాసేపు మరిగాక పులుసు చిక్కబడుతుంది. స్టవ్ ఆపేసి వేడి పులుసు లో వెన్నముద్ద కలపాలి. పులుసు బాగా చల్లారాక మొన్న వేసవిలో పెట్టిన కొత్తావకాయ మీది తేటని పులుసులో కలపాలి. ఒకరాత్రంతా కదపకుండా గిన్నెలోనే ఉంచేసి, మర్నాడు ఉదయం అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.

ఇది నేను మిత్రుడి ద్వరా తెలుసుకుని రాశాను

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *