బొటిక నేలు దరువు …కథ

ఎండా కాలం ఉడుకుతాంది .. ఆకులు రాలుతాండాయి..మా చ‌ర్చికాంపౌండులో ఉండే యాప చెట్లు ఆకు రాలుచ్చాండాయి..మా య‌మ్మ మా య‌క్కోళ్ళు రోజూ తెల్లార‌తానే లేసి ఆకులు అన్నీ ఊడ్సి దిబ్బ‌కు ఏచ్చాండారు.. అప్పుడ‌ప్పుడే శింత శిగురు మొలుచ్చాండాది. ఒక రోజు పొద్ద‌న్నే మా ఇంటి కాడికి ఆవులక్క కూర‌గాయ‌ల గంప ఎత్తుకోని వ‌చ్చింది. వంకాయ‌లు త‌మేట కాయ‌లు తీసుకోని వ‌చ్చింది. మా య‌మ్మ వంకాయ‌లు తీసుకున్నెది ఆవుల‌క్క కాడ ఆ వంకాయ‌లు సూచ్చానే నాకు నోరు ఊరింది. అంతే మా ఇంటికాడ ఉండే శింత శెట్టు ఎక్కితి..నేను అట్ట శింత శెట్టు ఎక్క‌డం జూసి మాయ‌మ్మ .. సూచ్చివా ఆవుల‌క్క నా కొడుకు శెప్ప‌కుండానే ఎట్ట శెట్టు ఎక్కుతుండాడో వంకాయ‌లు సూచ్చే వానికి బో కుశాల .. అన్నెది …ఆవుల‌క్క కూడా నేను శెట్టు ఎక్క‌డం జూసి ఓరినీ పిల్లోడా అన్నెది.. నేను మాత్రం చింత శెట్టు కొమ్మ‌ల శివ‌ర్ల‌కు పొయి యాలాడ‌తా శింత శిగురు తెంపితి..రెండు నిక్క జోబులు నిండినాక సొక్కా నిక్క‌ర్లోకి తోసి శింత శిగురు క‌డుపు కాడ పెట్టుకుంటి..ఇంగ పెట్టుకోడానికి ఎక్క‌డా లేక దిగి వ‌చ్చి మంచం మీద చాట పెట్టి నా జోబుల్లోది సొక్కా లోది శింత శిగురు ఇదిలిచ్చి అప్పుటికే మాయ‌మ్మ వంకాయ‌లు .. కోచ్చాంది నేను ఏటికి పోయి వ‌చ్చి .. నేను వ‌చ్చార్క‌నే మాయ‌మ్మ వంకాయ వ‌ట్టిశాప‌లు శింత శిగురు కూరాకు శేచ్చాంది.. ఒక ప‌క్క సంగ‌టికి పెట్టింది…సంగ‌టి కుత కుతా ఉడుకుతాంది.. ఇంగొక ప‌క్క వంకాయ వ‌ట్టిశాప‌ల కూర గ‌మాయిచ్చాంది. రాగిపిండి వాస‌న..వాస‌న ..ఇంగొక ప‌క్క వంకాయ‌లు వ‌ట్టిశాప‌లు శింత శిగురు కూరాకు వాస‌న నాకు ..క‌డుపులో ఎల‌క‌లు ప‌రిగెత్తాండాయి.. మా య‌మ్మ నీళ్ళు పోసుకో పో నాయినా అనె .. స‌రేలే మా అనుకుని పోయి గ‌బ గ‌బా రెండు శెంబులు నీళ్ళు గుమ్మ‌రిచ్చుకోని వ‌చ్చి… గ‌బ గ‌బా తుడ్సుకుంటి. నేను వ‌చ్చార‌క‌నే మా య‌మ్మ సంగ‌టి కుండ‌కు పంగల క‌ర్ర ఆనిచ్చి దాని మీద కాలు పెట్టి తాటి తెడ్డుతో సంగ‌టి గెలుకుతాంది ..నేను నెత్తి తుడ్సుకోని గుడ్డ‌లు ఏసుకోని వ‌చ్చార‌క మాయ‌మ్మ సంగటి బండ‌మీద బోర్లిచ్చి బోలు తీసుకోని .. సంగ‌టి ముద్ద‌లు శేచ్చాండాది.. మా య‌న్నోళ్ళు మా య‌క్కోళ్ళు అంద‌రూ వ‌ర్స‌గా వ‌చ్చి కూచ్చుండిరి ..మాయ‌మ్మ ఒక గిన్నెలో సంగ‌టి పెట్టి కూరాకు ఏసి నాకు ముందు ఇచ్చింది.. మా చంద్ర‌క్క ఏమ్మా వానికి ముందు ఇచ్చాండ‌వే అంటే నా శిట్టి కొడుకు పొద్ద‌నే అడ‌క్కుండానే .. శింత శిగురు కోసుకోని వ‌చ్చినాడు నువ్వు అట్టున్న పుల్ల ఇట్ట తియ్య‌వు.. వానికి పెడితే ఏడుచ్చావు అని మా య‌క్క‌ను తిట్టింది. మా య‌క్క అలిగింది.. అలుగు పో నీ క‌డుపే కాలుతుంది అన్నెది. అది రోజూ జ‌రిగేదే.. నేను మాత్రం ఉడుకుడుకు రాగి సంగ‌టి.. వ‌ట్టిశాప‌లు వంకాయ శింత శిగురు కూర‌లో అద్దుకోని మింగితి.. ఆ కూర సంగ‌టి అదొక అమృతం .. జీవితంలో మ‌ర్సిపోలేని కూరాకు అది ..
అంద‌రం సంగ‌టి తింటిమి.. అంద‌రు తిన్నాక మిగిలిన సంగ‌టిలో కూరాకు ఏసుకోని మాయ‌మ్మ కూడా తినింది. ..మా య‌మ్మ తువ్వాలుతో శెయ్యి తుడ్సుకోని ..ఇంగ పా నాయ‌నా అనె నేను మా య‌మ్మ మా య‌క్కోళ్ళు కొంగ‌ల రామాపురం తిట్టు దావ‌బ‌డ్తిమి ..కొంగ‌ల రామాపురంలో యారో పెద్ద‌య్య గారి క‌ల్లంలో శెన‌క్కాయ‌లు తెంప‌డానికి పోతిమి…మా య‌మ్మ మా యక్కోళ్ళు శ‌న‌క్కాయ క‌ట్ట తెంపుతాంటే …నేను కాసేపు తెంపి ఒక సంచి తీసుకోని శెన‌క్కాయ శేనిత‌ట్టు పోతి ..అప్పుటికే సోమయ్యాగాడు ఆడికి శేరుకున్నాడు .. న‌న్ను జూసి న‌వ్వినాడు నేను కూడా న‌గితి ..సుబ్బారెడ్డి ఎద్దుల‌ను అదిలిచ్చా పీకేసిన శెన‌క్కాయ శేనుదున్నుతున్నాడు..శెన‌క్కాయ పీకినాక కొన్నికాయ‌లు భూమిలోనేమ‌గిలి పోతాయి.. ఆ కాయ‌ల‌ను శేనిగ‌ల్ల వారు తీసుకోరు.. కాకులు .. పిట్ట‌ల‌తో పాటు కొంద‌రు ఏరుకుంటా ఉంటారు..నేను సోమ‌య్య గాడు సాలంబ‌డి శ‌న‌క్కాయ‌లు పోటీ ప‌డి ఏరుకుంటిమి .. అది అర ఎక‌రా క‌య్య కాడంతో ప‌యిటాల క‌ల్లా దున్న‌డం అయి పోయింది. సుబ్బారెడ్డి కాడిని అట్ట‌నే వ‌దిలేశి సద్ది తిన‌డానికి పోయినాడు..నేను సుబ్బారెడ్డిని అడిగి మ‌డ‌క‌దున్న‌డం తిరుక్కుంటి..ప‌గ్గం ప‌ట్టుకోని ఎద్దుల‌ను అదిలిచ్చాంటే దానెక్క ఆ ఆనందం యాడ గూడా రాదు.. ప‌గ్గాలు ఒక శేత నాగ‌లి ఒక శేత ప‌ట్టుకోని ఎద్దుల‌ను అదిలిచ్చా.. పా..ఓ.. అహె అహె అనుకుంటా .. ఉంటే అల‌వాట‌యిన ఎద్దులు తోక అట్ట ఇట్టా క‌దిలిచ్చా త‌మ మీద వాలుతాన్న ఈగ‌ల‌ను ఇదిలిచ్చుకుంటా.. బో వ‌య్యారంగా న‌డుచ్చాంటాయి ..ఒక అర‌గంట ఇరుసాలు దున్నితి.. నేను దున్నుతాంటే సోమ‌య్య గాడు సాలంబ‌డి శెన‌క్కాయ‌లు ఏరినాడు ఆ శెన‌క్కాయ‌లు ఇద్ద‌రం బాగం పంచుకుంటిమి ..నేను క‌ల్లం కాడికి పోయి ఇంటికి పోతాండ‌మా అని శెప్తి మా య‌మ్మ శేచ్చాన్న ప‌ని ఇడ్సిపెట్టి నా కాడికి వ‌చ్చి నేను ఏరిన శ‌న‌క్కాయ‌ల‌ను జూసి న‌న్ను ద‌గ్గ‌రికి తీసుకోని ముద్దుకున్నెది.. ఇది జూని మాకు వ‌ర్స‌కు శిన్న‌మ్మ అయిన సంతోష‌మ్మ  .. అబ్బ ఏమి కొడుకును కంటివే లైస‌క్కా అన్నెది.. న‌న్ను క‌డుపుకు అదుము కోని మా య‌మ్మ అమాశ‌రోజు పుట్టినాడు క‌దా.. ఈ నా కొడుకు మంచి సంసారి అవుతాడు ..అంటాఉంటే .. మా శిన్న‌మ్మ న‌వ్వి ఇప్పుడు సంసారే పెద్ద‌యినాక సూడాలి ..ఈ మొగ‌నాబ‌ట్ట‌లు ఆడోళ్ళ ఎంటంబ‌డి తిర‌గ‌డం తిరుక్కుంటారు .. అని అన్నెది…ఇంత‌లో్పు ఆ త‌ట్టు న‌డ్సుకుంటా వ‌చ్చిన మాకు వ‌ర్స‌యినాయ‌మ్మి. …న‌న్ను చూసి ఓత్తా ఏంది నీ కొడుకు బుడ్డ మీర‌ప కాయ మ‌యిన నా మోకాళ్ళ ఎత్తుగూడా లేడే అన్నెది..మా య‌మ్మ నా నెత్తి నిమురుతా.. బుడ్డ మీర‌ప‌కాయ కొరికి సూడే నీకే తెలుచ్చ‌ది అని మా య‌త్త కూతురును రెండు మూడు శెడ్డ మాట‌లు తిట్టింది.
నేను సోమ‌య్య గాడు ఇద్ద‌రం ఇంటి దావ బ‌డ్తిమి .. ఇంటికాడ శెన‌క్కాలు బాన‌లో పోసిసంచి తీసి సూర్లో పెట్టి .. స‌గిలేటి దావ బ‌డ్తిమి. అప్పుటికేమా సావాస గాళ్ళు ఈత కొడ‌తా ఉండారు.. మేము ఏటి కాడికి పోయి గుడ్డ‌లు ఇప్పి కంప శెట్టు కింద పెట్టి ఉరుకుతా పొయి గార గ‌డ్డ మీద నుండి ఏట్లోకి ప‌ల్టీ కొడ్తి.. సామ‌య్య గాడు కొర్రు కొట్టినాడు… ఆ ఏట్లో అట్ట దూకేది మేమిద్ద‌ర‌మే మాకు ప‌ల్టీ కొట్ట‌డం కొర్రు కొట్ట‌డం  అల‌వాటు ఒక రోజు వాడు ప‌ల్టీ కొడితే నేను కొర్రు కొడ‌తా.. నేను ప‌ల్టీ కొడితే వాడు కొర్రు కొడ‌తాడు నీళ్ల‌లో దూకి మునిగీత ..ఎన‌కీత కొడితిమి ..అద‌యినంక అంద‌రం క‌ల్సి తాకేసుకు నే ఆట ఆడితిమి మాప‌టేల దాకా ఈత కొట్టి ఇంటికివ‌చ్చార‌క మా య‌మ్మ వాళ్ళు గూడా ఇంటికి వ‌చ్చిరి మా య‌క్కోళ్ళు పెద్ద రోట్లో రోక‌ళ్ళు తీసుకోని వ‌డ్లు దంచుతాంటే మా య‌మ్మ దంచిన  ఒడ్ల‌ను శాట‌లోకి తీసుకోని శెరుగుతాంది.. నేను పోతానే మా య‌మ్మ మెత్త‌టి తౌడు పెట్టినాది ఒడ్లు దంచినాక దాంట్లో తౌడు వ‌చ్చ‌ది అది బ‌రుగొడ్ల‌కు నీళ్ళ‌లో క‌ల‌పి తాపిచ్చారు…
మొగ‌పిల్లోళ్ళు బ‌లంగా త‌యారు కావాల‌ని అట్ట మా య‌మ్మ‌నాకు తౌడు పెట్టేది.. ఆ యాల మా య‌మ్మ వ‌రికూడు వండినాది .. ఆ ఒరికూట్లో శింతాకు వంకాయ వ‌ట్టి శాప కూరాకు ఏసుకోను సంపితి..
అట్ట రోజుకో వంట శేచ్చాన్న‌ది మా య‌మ్మ .. ఒక్కోరోజు గోవాకు కారెం ఒక్కోరోజు .. ఇంగొక‌టి.. ఇట్ట తింటాంటిమి .. వానా కాలం వ‌చ్చినా కూడా వాన‌లు కుర్స‌క పాయ ..కూరా నారా తినడం త‌క్కువాయ ..ఎండా కాలం అయి పోయినా కూడా ఇంగా వాన‌లు ప‌డ‌క పాయ స‌గిలేట్లో నీళ్ళు కూడా ఇంకి పోయినాయి ..గుండాలు కూడా ఎండి పోయినాయి ..ఉన్న ఒక్క‌ర‌వ్వ నీళ్ల‌లో బ‌రుగొడ్లు క‌డ‌గ‌డం సాక‌లోళ్ళు .. గుడ్డ‌లు ఉత‌క‌డం తిరుక్కండార్క నీల్ళు గ‌బ్బు ప‌ట్టినాయి.. కూర‌గాయ‌లు రావ‌డం లేదు.. ఇంట్లో కూరాకులు త‌గ్గి పోయినాయి. నేను మాత్రం రోజూ ఏటికి పోయి ఆడ ఈడ శిన్న శిన్న గుంత‌ల్లో శాప‌లు పుల‌మ‌క‌చ్చాంటి… అట్ట ఆ నీళ్లు  కూడా ఎండి పోయినాయి.. ఇంట్లో శెన‌క్కాయ‌ల కారెం.. ఆ కారం ఈ కారం దంచు తాండారు..
ఒక రోజు  మా నాయ‌న మూక‌ట తీసుకోని రెండు మెర‌ప కాయ‌లు .. నాలుగు క‌రెప్పాకు ఆకులు రెండు మూడు తెల్ల‌బాయ‌లు.. క‌ళ్ళు ఉప్పు తీసుకోని ఒక శిన్న గ్లాసులో నీళ్ళు తెచ్చ‌కోని మంచం ఎల్లెల‌క ఏసి దాని మీద కూచ్చోని మూక‌ట ఒళ్ళో పెట్టుకోని .. ఒట్టి మిర‌ప కాయ‌లు .. ఉప్పు క‌రెప్పాకు అన్నీ ఒక‌టి అయినాక ఒక‌టి మూక‌ట మీద రుద్దుతా ఒక శేత్తో నీళ్ళు శేతిలోకి తీసుకోని .. ఒక్కొ సుక్క ఇడుచ్చా .. ఉండాడు …అట్ట శానాసేపు రుద్దితే అయ‌న్నా అరిగి పోయి .. ర‌సం అయింది ఎర్ర‌గా దాన్ని అట్ట‌నే మూక‌ట్లో పెట్టి శెయ్యి క‌డుక్కున్నాడు మా నాయ‌న ఇంత‌లో మా య‌మ్మ సంగ‌టి గెలికింది. ..రెండు ముద్ద‌లు నాకు మా నాయ‌న‌కు ఏసి ఇచ్చినాది.. మూక‌ట్లో ఉన్న‌దాంట్లో నేను మా నాయ‌న ఇద్ద‌రం అద్దుకోని సంగ‌టి మింగినాము.. అది కారం కారంగా బో క‌మ్మ‌గా అనిపిచ్చింది. మేము మిగిలిచ్చిన దాంట్లోనే మా య‌మ్మ ఒక ముద్ద సంగ‌టి ఏసుకోని తిన్నాది ..ఆ రోజు మ‌ద్యాన్నం నుండి ఒక్క ర‌వ్వ మోడం ప‌ట్టినాది..నేను నా సావాస గాళ్ళ‌తో క‌లిసి స‌మాధుల్లో ఉండే శెట్టుమీద కోతి కొమ్మ‌చ్చి ..ఢీండార్ …దొంగా పోలీస్ ఆట అడుకుంటిమి… నా సావాస గ‌త్తె నేను ఒక సాట చెట్టు మొద‌ట్లో ముడుక్కుంటిమి.. సోమ‌య్యాగాడు మ‌మ్మ‌ల్ని ఎంత సేప‌టికి క‌నుక్కోలేక పోతే తూచ్ చెప్పి బ‌యిటికి వ‌చ్చిమి.. ఆ రోజు మాపిటేల మా నాయ‌న మంచం కాళ్ళ క‌ట్ట బిగిచ్చాంటే మా నాయ‌న‌కు వ‌ర‌సైన  ఆయ‌ప్ప వ‌చ్చి
ఏం మామా వాన‌లు ప‌డక పాయ అన్నాడు.. దానికి మా నాయ‌న ఒరే నీయ‌క్క నన్న‌డిగితే కురుచ్చాయా ఆ దేవుడిని అడుగు అన్నాడు.. అది కాదు లే మామ నీకు  శెతురు ఎక్కువ గాని ఇంతకు ఏమి తింటివి ఇయ్యాల అన్నాడు.. ఏముందోయ్ కూరా నారా ఏమి లేకుంటే బొటిక‌నేలు ద‌రువేచ్చి … అన్నాడు మా నాయ‌న ..నాకు ఆ మాట అప్పుడు తెలిసింది.. ఇంత‌కు నువ్వేమి తిన్నావోయ్ అంటే ఎర్ర కోడి కూర మామా అన్నాడు ఆ మ‌నిషి త‌ల‌కాయ ఎగ‌రేచ్చా .. అవునులే మీ ఇంటిదావ‌న వ‌చ్చాంటే ఒట్టి మిర‌ప‌కాయ‌లు ఏంచుతాన్నె వాస‌న వ‌చ్చాన్న‌ది లే అని ఇద్ద‌రూ శ‌తురు మాట‌లు ఏసుకుండిరి. పేద రికంలో ఉండి వాళ్ళు తినే సామ‌న్య‌మైన తిండికి ఇట్టాటి గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటారు అనేది తెల‌స్సుకుంటి అప్పుడే ..ఆ రోజు బాగా ఆడి ఆడి అల్సి పోయినాను రాత్రి బువ్వ‌తిని ప‌డుకున్నాను..రోజూ మాదిరే  మా ఇంటి ముందు వ‌ర‌స‌గా నులక మంచాలు ఏసుకోని పండుకుంటాము.. ఆరోజు గూడా మా నాయన సంక‌లో దూరి ప‌డుకున్నాను..రోజు మాదిరే గాలి ఆడ‌కుంటే మా నాయ‌న పై పంచె తీసి ఇసురుతాన్నాడు .. ఉన్న‌ట్టు ఉండి వాన అందు కున్నెది ..అంద‌రూ లేసి మంచాల‌ను ఇంట్లోకి ఎత్త‌క పోతాండారు.. నేను మాత్రం గోడ ప‌క్క‌కు పొయి ఉచ్చ పోసుకుంటా ఉండాను..అంత వ‌రకే  మ‌తికి ఉంది.. అంద‌రూ మంచాలు లోప‌ల ఏసుకోని పిల్లోళ్ళు అంద‌రూ  పండుకున్నారా ఎవురు యాడ పండుకున్నారు .. అని ఒక సారి చూసుకుంటాంటే నేను మా రెండో అక్క కాడ పండుకుంటాను. అప్పుడ‌ప్పుడు .. మా నాయ‌న ఏమ్మా క‌ళ్యాణి శిట్టి నీ కాడ పండుకున్నాడా అని అడిగినాడంట లేదు నాయ‌నా అన్నెదంట మా యక్క అంద‌రి మంచాల మీద ఎతికితే ఎక్క‌డ కూడా క‌న‌డ‌లేదు అంట‌.. దాంతో ఆ జోరు వాన‌లో మా య‌మ్మ నాయ‌న మా య‌క్కా  వాళ్ళు త‌లోదిక్కు ఎతుకులాడితే యాడ కూడా క‌న‌ప‌డ‌లేదంట .. మా య‌మ్మ వాంకిళ్లు పెట్టి ఏడుచ్చాందంట‌… ఏమ‌యినాడ‌మ్మ నా కొడుకు అని మేము ఉండే కాడ‌నే ఒక పెద్ద బంగ‌ళా ఉంది దానికి బీగాలు ఏసి ఉంటారు.. బ‌డి పిల్లోళ్ళు వ‌చ్చినప్పుడే తెరుచ్చారు దాన్ని .. ఆ బంగ‌ళాలో ఒక హాలు ఉంట‌ది దాంట్లో బెంచీలు వేసి ఉంటారు.. వ‌ర్స‌గా.. ఆ హాలుకు ఉండే ఒక త‌లుపుకు చిన్న బొక్క ఉంది . అంతా ఎతికి వీడు మ‌ద్యాన్నం ఆడుకున్నాడు గ‌దా అని దాని తాళాలు తెప్పిచ్చి దాంట్లో ఎతికితే .. ఆ బెంచీల మీద పండుకోని ఉన్నానంట .. మా య‌మ్మ న‌న్ను ఎత్తుకోని గ‌ట్టిగ‌ట్టిగా ఏడుచ్చాంటే నాకు మెల‌క‌వ వ‌చ్చినాది.. మా నాయ‌న న‌న్ను ఎద‌కు క‌రిపిచ్చుకోని .. ఇంటికి తీసుకోని వ‌చ్చి పక్క‌న పండేసుకున్నాడు.. మ‌ళ్ళా రోజు నేను అట్ట ఎందుకు అట్ట పోయినానో మ‌తికి లేదు అయితే .. బొటిక‌నేలు ద‌రువు అనేది ఎప్పుడు ఇన్నా గూడా ఆ రోజు మా నాయ‌న‌తో కూకోని తిన్నె ఆ సంగ‌టి ఆ రుచి .. ఆ రోజు నేను క‌న‌ప‌డ‌క పోడం మాత్రం మ‌తికి వ‌చ్చానే ఉంట‌ది..మా నాయ‌న జ్ఞాప‌కం మాదిరి

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *