శాప గుడ్డు..కథ

ఒక సారి మా య‌క్క క‌ళ్యాణ‌క్క నేను ఏదో తుల‌వ ప‌ని చేసినాన‌ని వాంచి ఇడ్సింది బెత్తం తీసుకోని  … ( న‌న్ను శిన్న త‌నాన బో ముద్దుగా సాకింది ఆయ‌క్కే లే..ఎట్టంటే న‌న్ను ఎత్తుకోని ఎత్తుకోని న‌డుము కు కాయ‌లు కాసినాయంట‌) అట్టాటి అక్క‌కు నేను కోపం తెప్పిచ్చినానంటే నేను ఎంత తులవ నా కొడుకునో అర్థం చేసుకోండి .. ఎవ‌ర‌న్నా ఏమ‌న్నా అంటే ఎన‌కేనుకోని వ‌చ్చే మా యక్కే న‌న్ను కొడితే నేను ఏం జెయ్యాల .. అలిగి ఇంట్లోనుండి స‌గిలేటి లేకి పోతి .. ఏడుపు వ‌చ్చాంది కోపం వ‌చ్చాంది బాధ క‌లుగుతాంది,, ఏట్లోకి పోయి జంబుగుంత సూచ్చి నీళ్ళు ఒక్క‌ర‌వ్వ త‌క్కువ‌గానే ఉండాయి.
ఈడ మ‌ళ్ళా జంబు గుంత గురించి చెప్పాల .. నేను పుట్ట‌క ముందు ఎప్పుడో స‌గిలేరు వాగులోనే ఒక ప‌క్క బాయి ఉన్నెదంట ఆ బాయి జాప‌ర‌య్య వాళ్ల దంట .. కాల‌క్ర‌మేణా ఆ బాయి పూడి పోయినాది. అయితే అది గుంత గా మారింది.. దాంట్లో ఊట కూడా వ‌చ్చాంటాది .. స‌గిలేరు ఎండినా కూడా దాంట్లో ఒక‌ర‌వ్వ‌న్ని నీళ్ళు ఉంటాయి.స‌గిలేరు ఒక్కో సారి దాని మీద నుండే పారుతుంది. నీళ్ళు తగ్గిన‌ప్పుడు ఆ జంబు గుంత‌లోనుండి ఊట నీళ్ళు స‌గిలేటి పాయ‌లో క‌లుచ్చుంటాయి. … ఏట్లో నుండి శాప‌లు ఆ గుంత‌లోకి ఎక్కుతుంటాయి …ఎక్క‌డ మైతే ఎక్కుతాయి గాని .. అవి ఇంగ దిగిరావు . ఎందుకంటే అది మాంచి మ‌దుగు కాబ‌ట్టి.. ఇంత‌కు ఆ గుంత‌కు జంబు గుంత అని ఎందుకు పేరు వచ్చిందంటే ..ఏట్లో తుంగ జంబు అని రెండు ర‌కాల నీటి మొక్క‌లు ఉంటాయి .. తుంగ ఒక్క‌ర‌వ్వ గ‌ట్టిగా ఉంటుంది. జంబు ఒక్క‌ర‌వ్వ పెలుసుగా ఉంటుంది.
స‌రే ఇంగ అస్స‌లు క‌థ‌లోకి వ‌చ్చే ఆ జంబుగుంత‌ను సూచ్చానే నాకు ఒక ఆలోచ‌న వ‌చ్చింది.. నా కోపం స‌ల్లారాలంటే ఈ నీళ్ళ‌న్నీ స‌ల్లాలి అని అనుకున్నా .. ( నాకు ఎవ్వ‌రి మీద‌యినా కోపం వ‌చ్చే నా శ‌రీరం అల‌స‌ట ప‌డే వ‌ర‌కు ఏదో ఒక ప‌ని జేచ్చాను లే ఈత కొట్ట‌డ‌మో లేకుంటే ని…క‌ట్టెలు న‌ర‌క‌డ‌మో ..బాయిలో నీళ్ళు శేద‌డ‌మో ఇట్టాటియి శేచ్చాంటిలే) మెల్లంగా మా ఇంటి జాలాడి కాడికి పోతి మా యక్క… మా య‌మ్మ కుసినిలో ఏదో ప‌ని చేసుకుంటాండారు.. నేను మెల్లంగా పొయి జాలాట్లో గుంజ‌కు ఏలాడ దీసిన ఎత్త‌లి మెల్లంగా తీసుకోని ఏట్లోకి ఉరుకుతా పోతి .. ఎత్త‌లి మ‌ధ్యి లో నిల‌బెట్టి అది కింద ప‌డ‌కుండా ఆప‌క్క ఈ ప‌క్కా రెండు రాల్లు పెట్టి .. ఆ ప‌క్క ఈ ప‌క్క పాత శెక్కులు ..( అంటే బంక‌మట్టి గ‌డ్డి క‌లిసిఉన్న దాన్ని పార తో న‌రికి తీస్తారు దాన్ని శెక్కులు అంటారు ) ఉంటూ వాటిని తీసుకోని క‌ట్టేచ్చి క‌ట్ట నిల‌బ‌న్నాది.. అట్టిట్ట‌సూచ్చి ఏట్లో ఎప్పుడు యాన్నో ఒక సోట పాత కుండ పెంకులు ఉంటాయి .. మాంచి సగం కుండ క‌నిపిచ్చే దాన్ని వాటంగా శెక్కోని … మెల్లంగా సల్లడం తిరుక్కుంటి ముందు పెంకునిండా ప‌ట్టిచ్చి ఒక ప‌ది నిముషాలు ఆప‌కుండా స‌ల్లితి.. అట్ట స‌ల్లుతాంటే అలుపువ‌చ్చి కాసేపు ఆగితి .. ఆయాసం తీసుకుంటా గుంత త‌ట్టు సూచ్చి శేప‌లు అప్ప‌టికే కెలిక లేచ్చాండాయి.. అవి జూసి ఇంగొక్క ర‌వ్వ పాణం లేసి వ‌చ్చినాది.. మ‌ళ్ళీదిగి స‌ల్లుతాండాను అట్ట స‌ల్లుతానే ఉండాను .. నీళ్ళు త‌గ్గే కొద్దీ శాప‌లు కాల్ళ‌కు త‌గులుతుండాయి .. కొన్ని పెంకులోకి వ‌చ్చాండాయి .. అట్ట వ‌చ్చిన వాటిని శేత ప‌ట్టుకోని ఎత్త‌ల్లోకి ఇడిచ్చా ఉంటి…శాప‌లు జిబ జిబా అట్టిట్ట శ‌రా పురిగా క‌దులుతాండాయి .. నేను స‌ల్లుతానే ఉండాను
అట్ట స‌ల్లుతాంటే .. మా య‌మ్మ నాయ‌న నేను ఎట్ట పోయినానో అని ఎతుక్కుంటా ఏట్లోకి వ‌చ్చి ఓ శిట్టెన్నా .. నాయ‌నా శిట్టెన్నా అని గ‌ట్టి గ‌ట్టిగా పిలుచ్చా వ‌చ్చిరి .. నేను అలిగినా క‌దా ప‌ల‌క‌లేదు .. ఏటంబ‌డి సూసుకుంటా వ‌చ్చి ఇడ్డో నా కొడుకు అని మా య‌మ్మ న‌న్ను క‌నుక్కున్నాది.
నేను గుంత‌లో నీళ్ళ‌న్ని అయిపోగొట్టడం జూసి .. వాయ‌మ్మా ఈడు మాంత‌మైన నా కొడుకమ్మా అని మా నాయ‌న్ను ఓయ్య ఇట్ట సూజ్జురా ఈ నా కొడుకు ఒక్క‌డే స‌ల్లినాడు జంబుగుంత అని చెప్తానే మా నాయన వ‌చ్చి .. చూసి న‌గినాడు .. నా కొడుకు క‌దా మొగోడు అన్నెట్టు .. మా య‌మ్మ న‌న్ను ఎతుకుతా గ‌డ్డికి పోదామ‌ని గంప సంక‌న పెట్టుకోని వ‌చ్చిన్నాది.. నేను నీల్ళు స‌ల్లుతా ఉంటే మా య‌మ్మ నాయ‌న శాప‌లు ఏర బ‌ట్టిరి ..శాప‌లు గంప‌కు అయినాయి.. అంతే కాదు రెండు మాంచి కొర్ర‌మ‌ట్ట‌లు కూడా దొరికినాయి..శాప‌లు అన్నీ ప‌డ‌తాఉంటే మా క‌ళ్యాన‌క్క వ‌చ్చి న‌న్ను ముద్దుకున్నెది .. నా త‌మ్ముడు త‌మ్ముడే అన్నెది., నేను ఆ మాట‌ల‌కు క‌రిగి పోతి..అంద‌రం క‌లిసి గంపెడు శాప‌లు ప‌ట్టుకోని ఇంటికి శేరుకుంటిమి… అన్ని శాప‌లు ఏమి చెయ్యాల అని మా య‌మ్మ మాకు ఎప్పుడ‌న్నా ఇట్ట శాప‌లో శియ్య‌లో తెచ్చి ఇచ్చే సంతోష సిన్న‌మ్మ‌కు ఇన్ని .. మార్త శిన్న‌మ్మ‌కు ఇన్ని పెట్టి పంపినాది. కొన్ని శాప‌లు తీసి ఎండ‌బోసినాది… నేను శింత శెట్టు ఎక్కి శింత కాయ‌లు తెంప‌కొచ్చినాను.. మా య‌మ్మ ..మిర‌ప‌కాయ‌లు .,.ద‌నియాలు .. జిల‌క‌ర్ర .. ఏంచి కొబ్బెర‌..తెల్ల‌గ‌డ్డ ఉల్లిగ‌డ్డ . అన్నీ రోట్లో ఏసి దంచినాదు .. శింత కాయ‌లు ఉడికేసి ర‌సం పిండినాది.. శాప‌ల మీద ఒక్క‌ర‌వ్వ ఆందెం చ‌ల్లి ఈ మ‌సాల అంతా ఏసి బాగా క‌లిపినాది.. కుండ‌లో తిర‌గ‌మాత ఏసి ఉల్లిగ‌డ్డ‌లు ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు ఏసి బాగా ఏంచి దాంట్లో ఒక్క‌ర‌వ్వ కరెప్పాకు …కొత్తి మీర ఏసినాది..అది బాగా దోర దోర‌గా కాగినాక అందులో శాప‌లు ఏసి కాసేపు మ‌గ్గినాక శింత కాయ పులుసు బేసింది .. ఒక గుడ్డ తీసుకోని దాంట్లో శాప‌ల్లో ఉండే జ‌న ( చేప గుడ్డు ) మూట గ‌ట్టి ఏసినాది…ద‌గ ద‌గా ఒక మంట త‌గులుతానే కూరాకు దించినాది.. శింత కాయ పులుసు బేసిన శాప‌ల కూర రా రా నీయ‌క్క ముందు నా సంగ‌తి సూడు అని సైగ చేచ్చాన్నెట్టు ఉంది. మా య‌మ్మ కూరాకులో గంటె పెట్టి గుడ్డ‌లో క‌ట్టిన ఆ శాప జ‌న బ‌య‌టికి తీసి ఒక శిన్న కూరాకు గిన్నెలో ఏసి నాకు తిన మ‌ని ఇచ్చినాది… అది ఎంత క‌మ్మ‌గా ఉన్నెదో శెప్ప‌డం ఎందుకు .. ఈ రోజు మా క‌ళ్యాన‌క్క కూతురు .. మా ఇంటికి వ‌చ్చినాది ..శాప‌లు తీస‌క‌చ్చి శాప‌ల్లో గుడ్డు ఉన్నెది .. అది జూసి నా శిన్న‌త‌నం మ‌తికి వ‌చ్చి మా య‌మ్మ‌ను మ‌ల్లొక్క సారి త‌లుసుకుంటి jambu shaapa guddu katha

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *