సాక్షిలో వచ్చిన నా పాదాలపై పువ్వు కథ

పాదాలపై పువ్వు
బత్తుల ప్రసాద్
ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని చీల్చుకుంటూ దూసుకు వెళుతోంది నా బైక్. నా మనసు అంతకంటే వేగంగా పరిగెడుతోంది. ఆనందంతో… ఉద్వేగంతో… జీవితంలో మొదటిసారి టైమ్‌కు వెళ్ళాలని మనసు ఆరాటపడుతోంది. నేను వెళ్ళాల్సిన ఆవశ్యకత ఏ ప్రియురాలిని కలవడం కోసమో కాదు… ఏ విఐపిని కలవడం కోసమో కాదు, పాతికసంవత్సరాల క్రితం నాకు విద్యాబుద్ధులు నేర్పించాలని విఫలమైన మా లెక్చరర్ గారిని కలుసుకోవడానికి వెళుతున్నాను.

ఆయన హిస్టరీ అధ్యాపకులు. అలాగని నాలుగు ముక్కలు చెప్పి వెళ్ళిపోయే అధ్యాపకులు కాదాయన. విద్యతోపాటు, సంగీతం, సాహిత్యం, సామాజిక స్పృహ, జీవితం పట్ల అవగాహన కలిగించాలనే తపన కలిగిన గొప్ప గురువు. ఇక నేనేమో కాలేజీ అంటే అల్లరి చేయడానికి, కోతివేషాలు వెయ్యడానికి… కొండొకచో లెక్చరర్‌లను ఆటపట్టించి హీరో అనిపించుకోవాలనే మనస్తత్వంతో పాటు జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల ఎలాంటి ముందుచూపులేని విద్యార్థిని.

తన విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాలని పాఠాలతో పాటు, సెమినార్లు, డిబేట్లు నిర్వహించేవారాయన. పాఠాన్ని అందరూ శ్రద్ధగా ఆలకించాలనే యోచనతో… హాజరు తీసుకునే ముందు ‘నా క్లాస్ పట్ల ఆసక్తిలేని వారు, అంతరాయం కలిగించేవారు ముందుగానే బయటకు వెళ్ళవచ్చ’ని చాలా హుందాగా చెప్పేవారు. క్లాసు నుండి బయటకు వెళితే ఆబ్సెంట్ పడుతుందని కొందరు భయపడినా నాలాంటి వారు ధైర్యంగా బయటకు వెళ్ళడానికి సాహసించేవారు. ఒక్కోసారి అన్యమనస్కంగా క్లాసులోనే ఉండిపోతే కూడా ఆయన పాఠం చెప్పే తీరు కట్టిపడేసేది. నిర్లక్ష్యంగా విన్నా కూడా కొన్ని మనసులోకి సూటిగా వెళ్ళి నాటుకుపోయేవి.

ఒకసారి మా కాలేజీ మేగజైన్ కోసం ఏదో గెలికాను. అది గురువుగారు చదివారు.
‘బాబూ. నువ్వు చాలా బాగా రాశావు. నువ్వు ఈ రంగంలో సాధన చేస్తే పైకి వస్తావు’ అన్నారు.
నేను విని ఊరుకొని ఉంటే ఎంతో సంస్కారంగా ఉండేది.
‘నాకేం ఖర్మ గురువుగారూ ఇలాంటివి రాయడం. నేను అయితే కలెక్టర్‌ని అవుతాను. లేకుంటే కాంట్రాక్టర్‌ని అవుతాను. అయి కాలేజీ పెట్టి మీలాంటి గురువులకు ఉద్యోగాలిస్తాను’ అన్నాను.

చచ్చు సలహాలు ఇచ్చే గురువులకు ఇలాంటి రిటార్డులే ఇవ్వాలని మా సీనియర్లు మాకు బోధ చేశారు. గురువుగారు ఏమీ మాట్లాడలేదు. నవ్వి ఊరుకొని వెళ్లిపోయారు. కాలం గడిచింది. నేను కలెక్టర్‌ని కాలేదు. కాంట్రాక్టర్‌నీ కాలేదు. ఏ అక్షరాలనైతే చులకన చేస్తూ మాట్లాడానో ఆ అక్షరాలనే అన్నంగా మార్చుకునే పాత్రికేయ వృత్తిలో చేరాను. కథలు రాయడం మొదలుపెట్టాను. నాకు గుర్తింపు వచ్చింది. సంఘంలో నాకో మర్యాద ఏర్పడింది. గురువుగారు చెప్పినట్టుగానే జరిగింది. కాని ఆరోజు ఆయనను ఎంత అవమాన పరిచాను? ఆయన మనసును ఎంత గాయపరిచాను. నా మనసులో అదో ముల్లులా స్థిరపడిపోయింది. ఎప్పుడైనా ఆయనను కలిసి క్షమాపణ చెప్పాలని కోరిక. కాని ఆయన ఎక్కడ ఉన్నారో, ఉంటే ఎలా ఉన్నారో, ఆయన నా కథలు చదువుతున్నారో లేదో? క్లాసులో అప్పుడప్పుడు సాహిత్యం గురించి ఆయన గొప్పగా చెప్పే మాటలు నాలో నాటుకుపోవడం వల్లే కదా బహుశా నేను రచయితను అయ్యింది. అంటే ఇప్పటి నా ఉపాధికి కారణం ఆయనే కదా. మరి ఆయనను నేను సత్కరించిన పద్ధతి ఏమిటి? తలుచుకుంటే దుఃఖం కలిగేది.

ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళితే ఆ పుస్తకానికి ముందుమాట రాసింది నా గురువు. మనసు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ రచయితను అడిగి నెంబరు సంపాదించాను. వెంటనే ఫోన్ చేద్దామనుకున్నాను. ధైర్యం సరిపోలేదు. ఏదో తెలియని నిరాశ, సిగ్గు. కొన్ని రోజుల తరువాత మాట్లాడాను. నా కథలు… చేస్తున్న ఉద్యోగం గురించి వివరించాను. అడ్రస్ తీసుకున్నాను. నా రచనలు పంపించాను. సమాధానం వచ్చింది. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నన్ను చూడాలనేది అందులో సారాంశం. ఆయనను కలిసే ఆ క్షణం వచ్చేసింది. అందుకే మనసు ఆరాటపడుతోంది.

వెంగళరావునగర్ నుండి గాంధీనగర్ ఓ గంట ప్రయాణం అనంతరం… గురువుగారు బసచేసిన హోటల్ కిందనే టిఫిన్ సెంటర్ ముందు బైక్ ఆపాను. గురువుగారు అక్కడే ఉన్నారు, ఎవరితోనో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఆయన నన్ను గుర్తుపట్టే సమస్యే లేదు. ఎంతోమంది విద్యార్థులు ఆయన అధ్యాపక ప్రయాణంలో తారసపడి ఉంటారు. ఆయన ఓ సముద్రం…. అందులో ఇంకిపోయిన నీటి తుంపరను నేను.

సంస్కారం మూర్తీభవించిన విగ్రహం. మనిషి బొద్దుగా ఉంటారు. విశాలమైన నేత్రాలు, తలపై వెంట్రుకలు కూడా చాలా క్రమశిక్షణగల సైనికుల్లా ఉంటాయి. అనివార్యమైన కళ్ళజోడు… అప్పుడు ప్యాంట్, షర్ట్ వేసేవారు. ఇప్పుడు లాల్చి పైజామాలో చాలా బాగున్నారు. జుట్టు కాస్త తెల్లబడింది. కాలంతోపాటు కళ్ళజోడు మారింది. అయినా ఆయన కళ్ళకు తగ్గట్లుగానే ఉంది. నేను ఆయన కంటపడకుండా పక్కగా నిలబడి ఆయన్ను గమనిస్తున్నాను. ఆయన కనిపించినప్పటినుండి నాకు కాలేజీలో ఉన్న భావన. ఆ రోజులు నా మనోఫలకంపై తారాడుతున్నాయి.

ఆయన ఫోన్ మాట్లాడ్డం ఆపి ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో వెళ్ళి నమస్కరించాను. వెంటనే తేరుకుని ‘నాన్నా’ అంటూ నన్ను దగ్గరగా హత్తుకున్నారు. ‘నువ్వు ఫలానా కదూ’… అంటూ….
పాతికేళ్ళక్రితం సరిగ్గా పరిచయం కూడా లేని నా గురువు… నన్ను ప్రభావితం చేసినవారు… ఇలా భవిష్యత్‌లో మేము తారసపడతామని కలలో కూడా అనుకోలేదు. టిఫిన్ తిన్న తరువాత బిల్లు ఆయనే కట్టారు. నేను ఇవ్వబోతే వారించారు. ఇద్దరం మెట్ల దారినుంచి మూడవ అంతస్థులో ఉన్న రూమ్‌లోకి వెళ్ళాము.
మా మాటల్లో అనేక విషయాలు. ముఖ్యంగా సాహిత్యం, జీవితం, కాలేజీ విషయాలు… నా కాలేజీ రోజుల్లోకి మా సంభాషణ మళ్లింది.

‘మీకో విషయం తెలుసా సార్! కాలేజీలో చదివే సమయంలో మిమ్మల్ని అభిమానించే వాళ్ళను, మీతో మాట్లాడే విద్యార్థులను చులకనగా, హేళనగా చూసేవాడిని. నేనే కాదు నా స్నేహితులు కూడా. ఎందుకంటే మా మైండ్‌సెట్ అలాంటిది. నా స్కూల్ రోజుల్లోనే ఓ కాలేజీ విద్యార్థి నా మైండ్‌సెట్ మార్చాడు. కాలేజీ అంటే గొడవలు చేయాలి, అల్లరి చేయాలి, అధ్యాపకులను ఏడిపించాలి. అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. అది హీరోయిజం… అదే విద్యార్థి ధ్యేయం అనేవాడు. ఆ మాటలు నాపై ఎక్కువ ప్రభావాన్ని చూపాయి. అందుకే కాలేజీ దశలో విద్యాబుద్ధులు నేర్చుకోవాలనే ప్రధానమైన మార్గాన్ని వదిలేసి తప్పుదారి పట్టాను. నేను వెళుతున్నది తప్పుదారి అని తెలిసే లోపే ఆ దారిలో కూరుకుపోయాను’ అంటూ తప్పులను ఆయన ముందు ఒప్పుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే కన్ఫెషన్… అంటే మత గురువుతో తాము చేసిన తప్పులను ఏదీ దాచుకోకుండా మనసు విప్పి చెప్పుకునే పాప పరిరక్షణ పొందడం. ప్రస్తుతం నా గురువు వద్ద నా పరిస్థితి కూడా అలాంటిదే…

ఆయన నా పశ్చాత్తాపాన్ని గమనించారు. కుమారుడు తన తప్పు తెలుసుకుని సరైన మార్గంలో పయనిస్తున్నాడని తండ్రి తెలుసుకున్నప్పుడు పడే ఆనందం…. ఆయన కళ్ళలో స్పష్టంగా కనిపించింది.
‘పాతికేళ్ళ క్రితం నువ్వు విద్యార్థివి… నేను అధ్యాపకుడిని… ఇప్పుడు నువ్వూ నా అంతటి వాడివయ్యావు. భవిష్యత్‌లో నాకంటే ఎత్తుకు ఎదగా’లంటూ నిండు మనసుతో ఆశీర్వదించారు.
ఆయనతో ఇంకా కొంతసేపు గడపాలని వుంది. కానీ అప్పటికే వృత్తి తాలూకు పని ఒత్తిడులు సెల్‌ఫోన్ రూపంలో శతపోరుతున్నాయి. గురువుగారిని వదల్లేక భారంగా సెలవు తీసుకుని బయలుదేరుతుంటే… ఆయన కూడా నాకు వీడ్కోలు పలకడానికి వారిస్తున్నా నా బైక్ వరకు వచ్చారు.

‘మీకు గుర్తుందా గురువుగారూ. కాలేజీరోజుల్లో మీరు నన్ను రచనలు చేయమని ప్రోత్సహించారు’ అన్నాను.
ఆయనకు గుర్తుంది. కాని గుర్తు లేనట్టు చిర్నవ్వుతో తల అడ్డంగా ఊపారు.
‘అప్పుడు మిమ్మల్ని హర్ట్ చేశాను గుర్తుందా’ అన్నాను.
ఆయన మళ్లీ చిర్నవ్వుతో తల అడ్డంగా ఊపారు.
‘అప్పుడే నన్ను చెంపదెబ్బ కొట్టి ఉంటే ఎంత బాగుండేది గురువుగారూ’ అన్నాను కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతుంటే.
ఆయన కళ్లు తడి అయ్యాయి. మాటలు కూడదీసుకుంటూ అన్నారు- ‘ఒక్కోసారి దండన తప్పును కడిగేస్తుంది. కాని క్షమనే దండనగా విధిస్తే ఆ క్షమ మనిషిని నీలా ఉన్నతుడిగా తీర్చిదిద్దుతుంది’…

నేను ఆయన కాళ్లకు నమస్కరించాను. తండ్రి పాదాలను తాకుతున్నట్టుగా అనిపించింది.
అప్పటి వరకూ నా బ్యాగ్‌లో ఉన్న నా కొత్త పుస్తకం తీశాను.
‘నా కొత్త పుస్తకం’ అంటూ ఆయన చేతిలో పెట్టాను.
తెరిచారు. ఆశ్చర్యపోయారు.
‘నా రచనాశక్తికి బీజం వేసిన మా గురువుగారికి క్షమాపణలతో అంకితం’ అని ఉంది అందులో.
ఆయన నావైపే చూస్తూ ఉండిపోయారు.
చాలారోజుల తర్వాత కడిగిన అద్దంలాంటి మనసుతో అక్కణ్ణుంచి కదలడానికి నేను బైక్ స్టార్ట్ చేశాను.
(నా గురువు కొప్పర్తి వెంకటరమణమూర్తి గారికి…)

ఆయన మనసును ఎంత గాయపరిచాను. నా మనసులో అదో ముల్లులా స్థిరపడిపోయింది. ఎప్పుడైనా ఆయనను కలిసి క్షమాపణ చెప్పాలని కోరిక. కాని ఆయన ఎక్కడ ఉన్నారో, ఉంటే ఎలా ఉన్నారో, ఆయన నా కథలు చదువుతున్నారో లేదో?

ఈ కథ 17-07-2012 సాక్షి లో అచ్చయింది. ఇది నిజంగా నా కథే…

Recommended For You

About the Author: admin

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *